Nun Rape Case: నన్‌పై అత్యాచారం కేసు.. బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ నిర్దోషే

మూడేళ్ల క్రితం కేరళలో కలకలం సృష్టించిన నన్‌పై అత్యాచారం కేసులో కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బిషప్‌ ఫ్రాంకో

Updated : 14 Jan 2022 15:21 IST

తీర్పు వెల్లడించిన కొట్టాయం కోర్టు

కొట్టాయం: మూడేళ్ల క్రితం కేరళలో కలకలం సృష్టించిన నన్‌పై అత్యాచారం కేసులో కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ నిర్దోషి అని ప్రకటించింది. బాధిత నన్‌పై బిషప్‌ ఫ్రాంకో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నదానిపై సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. 

కేసు ఉదంతం ఇది..

జలంధర్‌లోని రోమన్‌ క్యాథలిక్‌ చర్చలో బిషప్‌గా ఉన్న ఫ్రాంకో ములక్కల్‌పై 2018లో కేరళకు చెందిన ఓ 45ఏళ్ల నన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘‘2014 మేలో బిషప్‌ ఫ్రాంకో.. కురవిలంగద్‌లోని మా కన్వెంట్‌కు వచ్చారు. ఆ సమయంలో బిషప్‌ నన్ను రాత్రి సమయంలో గదికి పిలుపించుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. 2014, 2016 మధ్య పలుమార్లు ఆయన నన్ను లైంగికంగా వేధించారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించారు. అయితే, 2018 జూన్‌లో బిషన్‌ నన్ను, నా కుటుంబాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు’’ అని బాధిత నన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై అత్యాచార కేసు నమోదు చేశారు.

అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్‌.. 2018 సెప్టెంబరులో బిషప్‌ ఫ్రాంకోను అరెస్టు చేసింది. ఆ తర్వాత 2019 నవంబరులో కేసు విచారణ మొదలైంది. అయితే, కోర్టులో ఫ్రాంకో తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. అత్యాచారం జరిగిందని ఆరోపించిన తేదీలో తాను అసలు కురవిలంగద్‌ కన్వెంట్‌లో బస చేయలేదని ఫ్రాంకో వాదించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న కొట్టాయం న్యాయస్థానం.. బిషప్‌ ఫ్రాంకోను నిర్దోషిగా ప్రకటిస్తూ నేడు తీర్పు వెలువరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని