Updated : 24 May 2022 13:05 IST

Kerala: భర్తే దోషి.. సంచలనం రేపిన మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పు

తిరువనంతరపురం: కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన మెడికల్‌ విద్యార్థిని విస్మయ ఆత్మహత్య కేసులో సోమవారం తీర్పు వెలువడింది. ఆమె భర్త కిరణ్​ కుమార్​ను కేరళ కోర్టు దోషిగా తేల్చింది. కట్నం కోసం వేధించి, 22 ఏళ్ల విస్మయను భర్తే బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని న్యాయస్థానం నిర్ధరించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న కిరణ్​ను.. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు.

ఈ కేసులో దోషికి సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలా చూస్తామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్​రాజ్ పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదని.. సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో విస్మయకు న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కిరణ్​కు శిక్షతో తమ కుమార్తె తిరిగి రాకపోయినా.. భవిష్యత్​లో ఎవరూ ఇలా బలి కాకుండా ఉండేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దోషికి సాధ్యమైనంత శిక్ష పడాలని కోరారు.

ఇదీ జరిగింది..

ఆయుర్వేద వైద్య విద్యార్థిని అయిన విస్మయ చదువు పూర్తి కాకముందే 2019 మే 19న తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్​స్పెక్టర్​ అయిన కిరణ్​ కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. కట్నంగా 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ.10లక్షల కారు కూడా ఇచ్చారు. అయితే.. కారు నచ్చలేదని, తనకు రూ.10లక్షలు నగదు ఇవ్వాలని కిరణ్‌ డిమాండ్ చేశాడు. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురిచేసేవాడు.

ఈ నేపథ్యంలోనే 2021 జూన్​ 20న విస్మయ తన బంధువులకు ఓ వాట్సాప్ మెసేజ్ చేసింది. కట్నం కోసం కిరణ్​ తనను వేధిస్తున్నాడని వాపోతూ.. అతడు కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫొటోలు తీసి అందరికీ పంపింది. ఆ మరుసటి రోజే కొల్లాం జిల్లా సస్థంకొట్టాలోని కిరణ్ ఇంట్లో శవమై కనిపించింది. కాగా విస్మయ మృతికి కిరణే కారణమని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి, వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందంటూ 500పేజీలకుపైగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ ఛార్జ్​షీట్​ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈనెల 17న తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం కిరణ్​ను దోషిగా తేల్చింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని