Kerala: చావడానికి అనుమతి కోరితే.. బతకడానికి దారి చూపారు

ఉపాధి లేక.. తినేందుకు తిండిలేక ఇబ్బందులు పడుతున్న ఓ ట్రాన్స్‌విమెన్‌.. కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న కేరళ సర్కారు.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, భవిష్యత్తుకు భరోసా

Updated : 14 Jan 2022 07:23 IST

కేరళలో ట్రాన్స్‌విమెన్‌కు ప్రభుత్వ భరోసా

పాధి లేక.. తినేందుకు తిండిలేక ఇబ్బందులు పడుతున్న ఓ ట్రాన్స్‌విమెన్‌.. కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న కేరళ సర్కారు.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, భవిష్యత్తుకు భరోసా కల్పించింది. ఆ ట్రాన్స్‌విమెన్‌ పేరు అనీరా కబీర్‌. ఆమె డబుల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. ఎంఈడీ పూర్తి చేసింది. రాష్ట్ర అర్హత పరీక్షలో (సెట్‌) ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు తొలుత ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సామాజిక వివక్ష కారణంగా అనీరా పురుషుడి వేషధారణలో పాఠశాలలో ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమెకు ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె ట్రాన్స్‌విమెన్‌ అని తెలిసిన తర్వాత పాఠశాల అధికారులు, సహచరులు వ్యవహరించే తీరు మారిపోయింది. హేళన చేయడం మొదలు పెట్టారు. దీన్ని భరించలేక కొలువులో చేరిన రెండు నెలలకే మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. దీంతో ఆదాయం లేక పూట గడవడం కష్టమైంది. నానా అవస్థలు పడిన ఆమె చనిపోవడానికి సిద్ధపడింది. కారుణ్య మరణం కోసం లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఆశ్రయించింది. వారి సాయంతోనే కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలంటూ.. హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ విషయం రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో విద్యాశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి.. అనీరాను పిలిపించి, విద్యాశాఖలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష కేరళ ప్రాజెక్టులో నియమించి నెల రోజుల్లో పర్మినెంట్‌ చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని