Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్‌ బెయిల్‌పై విడుదల

యూపీలో అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్దీఖి కప్పన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. హాథ్రస్‌ అత్యాచార ఘటనను కవర్‌ చేసేందుకు వెళ్లిన అతడిని రెండేళ్ల కిందట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Published : 02 Feb 2023 13:33 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్‌ (Siddique Kappan) ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్‌ షరతుల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలు విలువైన రెండు పూచీకత్తులను ఆయన తరఫు న్యాయవాది నిన్న కోర్టుకు సమర్పించారు. దీంతో లఖ్‌నవూ జిల్లా జైలు నుంచి కప్పన్‌ గురువారం ఉదయం విడుదలయ్యారు. దాదాపు 28 నెలల తర్వాత అతడు జైలు నుంచి బయటకు వచ్చాడు.

2020 సెప్టెంబరు 14న హాథ్రస్‌(Hathras)లో ఓ దళిత యువతిపై ఆమె గ్రామానికే చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే, ఈ ఘటన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు అర్ధరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు చేయడం వివాదాస్పదంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ఆమెకు అంత్యక్రియలు చేశారని, కడసారి చూపు కూడా దక్కలేదని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు.

దీంతో ఈ ఘటనపై పరిశోధనాత్మక కథనాన్ని కవర్‌ చేసేందుకు సిద్దీఖీ కప్పన్‌ తన బృందంతో కలిసి హాథ్రస్ బయల్దేరగా.. మార్గమధ్యంలో యూపీ (Uttar Pradesh) పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. ఆమె మరణంపై హింసను ప్రేరేపించడానికే వెళ్తున్నారని పోలీసులు ఆరోపించారు. అతడికి నిషిద్ధ ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలున్నట్లు పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో కింది న్యాయస్థానాలకు బెయిల్‌ ఇవ్వకపోవడంతో కప్పన్‌ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. గతేడాది సెప్టెంబరులోనే అతడికి సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ఈడీ నగదు అక్రమ చలామణి కేసు పెట్టడంతో ఇంతకాలం జైలులోనే ఉన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు