bomb threat: టికెట్‌ రీషెడ్యూల్‌ చేయలేదని విమానానికి బాంబు బెదిరింపు

వ్యక్తిగత కారణాల వల్ల తమ విమాన ప్రయాణం వాయిదా పడడంతో టికెట్‌ రీషెడ్యూల్‌ చేయాలని ఓ వ్యక్తి విమానాశ్రయం అధికారులను కోరాడు. దానికి వారు అంగీకరించకపోవడంతో బాంబు బెదిరింపు చర్యలకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకొంది.

Published : 26 Jun 2024 15:10 IST

కొచ్చి: తమ టికెట్‌ను రీషెడ్యూల్‌ చేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు బెదిరింపులకు(bomb threat)  పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి కొచ్చి - లండన్ గాట్విక్(Kochi - London Gatwick) ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లుగా బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కొచ్చి విమానాశ్రయ అధికారులు(CIAL)  తనిఖీలు చేపట్టారు. తీవ్ర గాలింపుల అనంతరం అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడంతో విమానం లండన్‌కు బయలుదేరింది. 

ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కాల్ చేసిన వ్యక్తి లండన్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు షుహైబ్(30) అని తేలింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  షుహైబ్‌ మంగళవారం తన భార్య, కుమార్తెతో కలిసి AI 149 విమానంలో లండన్‌కు వెళ్లాల్సిఉంది. అదే సమయంలో ఆయన కుమార్తె ఫుడ్ పాయిజనింగ్‌తో బాధ పడుతుండడంతో టికెట్‌ను మరో రోజు రీషెడ్యూల్ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను కోరారు. ఎయిర్‌లైన్స్‌ అందుకు నిరాకరించడంతో నిరాశ చెందిన షుహైబ్‌ బాంబు బెదిరింపు చర్చలకు పాల్పడ్డారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని