Dowry Death: విస్మయ సూసైడ్‌ కేసు.. భర్తకు పదేళ్లు జైలు శిక్ష, భారీ జరిమానా!

కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని విస్మయ (22) ఆత్మహత్య కేసులో కొల్లం న్యాయస్థానం మంగళవారం శిక్షను ఖరారు చేసింది.......

Published : 25 May 2022 01:43 IST

కొల్లం: కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని విస్మయ (22) ఆత్మహత్య కేసులో కొల్లం న్యాయస్థానం మంగళవారం శిక్షను ఖరారు చేసింది. భార్యను కట్నం కోసం వేధించి, ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిన నేరం కింది ఆమె భర్త కిరణ్‌ కుమార్‌కు పదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.12.55లక్షల జరిమానా కూడా విధించింది. దీంట్లో రూ.2లక్షలు విస్మయ తల్లిదండ్రులకు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. విస్మయ ఆత్మహత్య కేసులో ఆమె భర్త కిరణ్‌ కుమార్‌ను నిన్న దోషిగా తేల్చిన న్యాయస్థానం.. వరకట్నం కోసం ఆమెను వేధించి.. ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించాడని నిర్ధారించిన విషయం తెలిసిందే. కిరణ్‌కుమార్‌ పాల్పడిన నేరాలకు విడివిడిగా శిక్షలు ఖరారు చేసిన న్యాయస్థానం.. ఆ శిక్షలన్నీ ఏకకాలంలోనే అమలవుతాయని స్పష్టంచేసింది. 

ఈ కేసులో అసలేం జరిగిందంటే?

ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయకు చదువు పూర్తి కాకముందే 2019 మే 19న తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్​ కుమార్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. కట్నంగా 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ.10లక్షల విలువచేసే కారు కూడా ఇచ్చారు. అయితే.. కారు నచ్చలేదని, తనకు రూ.10లక్షలు నగదు ఇవ్వాలని కిరణ్‌ డిమాండ్ చేశాడు. దీంతో ఇదే విషయంపై విస్మయను అతడు చిత్రహింసలకు గురిచేసేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే 2021 జూన్​ 20న విస్మయ తన బంధువులకు ఓ వాట్సాప్ మెసేజ్ చేసింది. కట్నం కోసం కిరణ్​ తనను వేధిస్తున్నాడని వాపోతూ.. అతడు కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫొటోలు తీసి అందరికీ పంపింది. ఆ మరుసటి రోజే కొల్లాం జిల్లా సస్థంకొట్టాలోని కిరణ్ ఇంట్లో శవమై కనిపించింది. కాగా విస్మయ మృతికి కిరణే కారణమని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి, వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందంటూ 500 పేజీలకు పైగా ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈనెల 17న తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో నిన్న కిరణ్‌కుమార్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఈరోజు శిక్ష ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని