Kerala: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేరళ మంత్రి రాజీనామా

భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి సాజి చెరియన్‌ రాజీనామా చేశారు.

Published : 06 Jul 2022 22:26 IST

తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి సాజి చెరియన్‌ రాజీనామా చేశారు. రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సీఎం పినరయి విజయన్‌కు అందజేశారు. 

అయితే, మంత్రి పదవికి రాజీనామా చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని చెరియన్‌ అన్నారు. తానెప్పుడూ రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదని చెప్పారు. కొంతమంది కావాలనే తన మాటలను వక్రీకరించారని తెలిపారు. సీపీఎంను, ఎల్​డీఎఫ్​ను బలహీనపరిచేందుకే ఇలా చేశారని పేర్కొన్నారు.

కాగా.. కేరళలోని పథనంతిట్ట జిల్లా మల్లపల్లిలో జరిగిన రాజకీయ కార్యక్రమంలో చెరియన్‌ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో ఎవరూ దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని మంత్రి చెరియన్‌ స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మంత్రిని వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని