Constitution: ‘దోపిడికి ఉపయోగపడేలా ఉంది’.. రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను దోచుకునేందుకు ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రాసినట్లు విమర్శించారు. రాష్ట్ర  మత్స్య, సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఇటీవల పథనంతిట్ట జిల్లాలో నిర్వహించిన ఓ...

Published : 05 Jul 2022 22:33 IST

తిరువనంతపురం: రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను దోచుకునేందుకు ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రాసినట్లు విమర్శించారు. రాష్ట్ర మత్స్య, సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఇటీవల పథనంతిట్ట జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాజ్యాంగం.. దోపిడిని సమర్థిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలు మంగళవారం టీవీ ఛానెళ్లలో ప్రసారం కావడంతో.. వైరల్‌గా మారాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి.

‘మనకు గొప్ప రాజ్యాంగం ఉందని.. దేశంలోని అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటని అందరం చెప్పుకొంటాం. కానీ, పెద్దఎత్తున ప్రజలను దోచుకునేందుకు ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. పైగా, రాజ్యాంగాన్ని బ్రిటిషర్లు సిద్ధం చేయగా.. భారతీయులు రాశారని పేర్కొన్నారు. భారత్‌ను కార్మికుల నిరసనలను అంగీకరించని దేశంగా పేర్కొంటూ.. రాజ్యాంగం కార్మిక దోపిడిని సమర్థించేదిగా ఉందన్నారు. కార్పొరేట్ రంగంలో మిలియనీర్లు పెరగడానికి ఇదే కారణమన్నారు.

మంత్రి వ్యాఖ్యలను రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. కేపీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ తదితరులు.. మంత్రిని తక్షణమే తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్‌కు డిమాండ్‌ చేశారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ‘సాజీ చెరియన్.. రాజ్యాంగ నిర్మాతలను కించపరచడమే కాకుండా లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి విలువలను అవమానించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలి’ అని సతీశన్ మండిపడ్డారు. ఆయనకు ఒక్క సెకను కూడా పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని