తిరగేసిన జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి.. రాజీనామాకు భాజపా డిమాండ్‌!

గణతంత్ర దినోత్సవం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కేరళ రాష్ట్ర మంత్రి ఒకరు తిరగేసి కట్టిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Published : 26 Jan 2022 19:06 IST

కాసర్‌గోడ్‌ (కేరళ): గణతంత్ర దినోత్సవం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కేరళ రాష్ట్ర మంత్రి ఒకరు తిరగేసి కట్టిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. విపక్ష భాజపా.. మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేసింది.

ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌కు చెందిన అహ్మద్‌ దేవర్‌కోవిల్‌ ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాసర్‌గోడ్‌ మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. అనంతరం తన ప్రసంగం కూడా పూర్తిచేశారు. అయితే, మంత్రి సహా కార్యక్రమానికి హాజరైన ఎవరూ ఈ పొరపాటును గుర్తించకపోవడం గమనార్హం.

అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులు పొరపాటును గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పొరపాటు తెలుసుకున్న మంత్రి మళ్లీ వెనక్కి వచ్చి జాతీయ జెండాను సరిచేసి మళ్లీ ఆవిష్కరించారు. దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ స్పందించారు. దేవర్‌కోవిల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తలకిందులుగా వేలాడదీసిన జెండాకు వందనం చేయడం పెద్ద తప్పని, మంత్రితో పాటు, సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. గణతంత్ర వేడుకల్లో ఇలా జరగడం దురదృష్టకరమని, ప్రభుత్వం చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నితాన్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని