Kerala Rains: కేరళలో వర్ష బీభత్సం.. 35కి చేరిన మృతులు.. 11డ్యాంలకు రెడ్‌ అలర్ట్‌

కేరళలో భారీ వర్షాలు బీభత్సం కొనసాగుతోంది. వర్షాల ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నీటమునగడం వంటి ఘటనలు రాష్ట్రాన్ని......

Updated : 18 Oct 2021 22:52 IST

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాల బీభత్సం కొనసాగుతోంది. వర్షాల ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నీటమునగడం వంటి ఘటనలు రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంలా మార్చేశాయి. ఈ వర్షాలతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. వర్షాల కారణంగా జరిగిన పలు ఘటనల్లో మృతుల సంఖ్య 35కి చేరింది. వరదనీరు భారీగా ఆనకట్టలకు పోటెత్తుతోంది. డ్యామ్‌ల వద్ద నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 11 ఆనకట్టల వద్ద రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇడుక్కి డ్యామ్‌ వద్ద గేట్లు మంగళవారం ఉదయం 11గంటలకు తెరవనున్నారు.

మరోవైపు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. 11 ఆనకట్టల వద్ద రెడ్‌ అలర్ట్‌ జారీచేసిన నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఎం పినరయి విజయన్‌ విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 247 క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  కక్కి ఆనకట్ట రెండు షెట్టర్లు తెరవడంతో పంపా నది నీటి మట్టం పెరుగుతోంది. దీంతో శబరిమలలో అయ్యప్ప దేవాలయానికి భక్తుల యాత్రను అధికారులు నిలిపివేశారు. భక్తులంతా తక్షణమే తిరిగి వెళ్లిపోవాలని దేవస్థానం బోర్డు కోరింది. వర్షాల ప్రభావంతో కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నెల 21, 23 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. వాటి తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

కేరళకు డీఎంకే ₹కోటి సాయం
భారీ వర్షాలతో విలవిలలాడుతున్న తమ పొరుగు రాష్ట్రం కేరళకు డీఎంకే సాయం ప్రకటించింది. కేరళలో సహాయక చర్యల నిమిత్తం తమ పార్టీ తరఫున రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టు డీఎంకే చీఫ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ వెల్లడించారు. వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని