Kerala Rains: కేరళలో అక్టోబరులో 135 శాతం అధిక వర్షపాతం నమోదు

కేరళలో అక్టోబరు 1 నుంచి 19వ తేదీ మధ్యలో సాధారణం కంటే 135 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఏటా ఈ తేదీల మధ్యలో 192.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.. కానీ ఈ సారి ఏకంగా 453.5 మిల్లీమీటర్లు..

Updated : 19 Oct 2021 22:23 IST

తిరువనంతపురం: కేరళలో అక్టోబరు 1 నుంచి 19వ తేదీ మధ్యలో సాధారణం కంటే 135 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏటా ఈ తేదీల మధ్యలో 192.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.. కానీ ఈసారి ఏకంగా 453.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ఈ నెల 16న రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పెద్దఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా  కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ‘ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏటా అక్టోబరు- డిసెంబరు మధ్యలో కేరళవ్యాప్తంగా 491.6 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదవుతుంది. వార్షిక వర్షపాతంలో ఇది 16.8 శాతం. కానీ.. ఈ ఏడాది అక్టోబర్ 1-19 తేదీల మధ్యలోనే 453.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఇప్పటికే 90 శాతానికిపైగా నమోదయినట్లు’ అని వాతావరణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

కోలికోడ్‌లో అత్యధికం..

రాష్ట్రవ్యాప్తంగా అళప్పుజ, త్రిస్సూర్‌ మినహాయించి మిగతా అన్నీ జిల్లాల్లో ఇప్పటికే 100 శాతం వర్షపాతం నమోదయింది. అత్యధికంగా కోలికోడ్‌లో 223 శాతం అధికంగా కురిసింది. అళప్పుజలో అత్యల్పంగా 66 శాతం మాత్రమే నమోదయింది. ఇటీవల రెండు రోజులు భారీ వర్షాలతో ఉపశమనం లభించినా.. బుధవారం మళ్లీ కేరళలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. తిరువనంతపురం, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్ తదితర జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. గురువారం సైతం కన్నూర్‌, కాసరగోడ్‌ మినహా మిగతా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని