‘లాటరీ, మద్యం ప్రధాన ఆదాయ వనరా?.. సిగ్గుచేటు’.. పినరయి సర్కారుపై గవర్నర్‌ వ్యాఖ్యలు

కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కారుపై ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు.

Published : 23 Oct 2022 01:49 IST

కోచి: కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కారుపై ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. ఇది వింటుంటే తనకే సిగ్గుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు అడ్డాగా ఉన్న పంజాబ్‌ను త్వరలోనే కేరళ దాటేయబోతోందని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా పినరయి విజయన్‌ సర్కారు, గవర్నర్‌కు మధ్య ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గవర్నర్‌ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్ని చోట్లా మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్నే ఓ ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు.

‘‘నూరు శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి సిగ్గుచేటు. రాష్ట్రంలో మద్యం, లాటరీని ప్రధాన ఆదాయ వనరులుగా చూస్తున్నారు. ఇలాంటి రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనందుకు నాకు సిగ్గుగా అనిపిస్తోంది. అసలు ఈ లాటరీలేంటి? పేద ప్రజలు లాటరీ టికెట్లు కొంటే ఇక్కడ కూర్చుని మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటారా? లాటరీ పేరు చెప్పి ప్రజల్ని దోచుకుంటున్నారు. ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేస్తున్నారు’’ అంటూ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన చోట.. మద్యం తాగాలని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని