Corona: గత వారం రోజుల్లో సగానికి పైగా కరోనా కేసులు కేరళ నుంచే..

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అక్కడ వారపు సగటు పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతోందని తెలిపింది. అలాగే ఒక్క కేరళలోనే లక్షకు పైగా క్రియాశీల కేసులున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్‌ అగర్వాల్ దేశంలోని కొవిడ్ పరిస్థితిని వెల్లడించారు. 

Published : 10 Aug 2021 18:54 IST

ఐదు రాష్ట్రాల్లో ఒకటిపైనే ఆర్‌ ఫ్యాక్టర్

దిల్లీ: దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అక్కడ వారపు సగటు పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతోందని తెలిపింది. అలాగే ఒక్క కేరళలోనే లక్షకు పైగా క్రియాశీల కేసులున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్‌ అగర్వాల్ దేశంలోని కొవిడ్ పరిస్థితిని వెల్లడించారు. 

గత వారంలో వెలుగుచూసిన కరోనా కేసుల్లో 51.51 శాతం కేసులు ఒక్క కేరళలో నమోదయ్యాయి. దేశంలో ఇప్పటికీ 37 జిల్లాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో 11 జిల్లాలు ఒక్క కేరళలోనే ఉన్నాయని పేర్కొంది. తమిళనాడులో ఏడు జిల్లాల పరిస్థితి అదే విధంగా ఉంది. అలాగే కేరళ ఒక్క రాష్ట్రంలోనే లక్షమందికి పైగా వైరస్‌తో బాధపడుతున్నారని వెల్లడించింది. 

హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఆర్‌ ఫ్యాక్టర్ ఒకటి కంటే ఎక్కువగా ఉండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్‌ ఫ్యాక్టర్ ఒకటి కంటే ఎక్కువగా ఉంది అంటే.. వైరస్ ఒకరి నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతుందని అర్థం. ప్రస్తుతం కొవిడ్ కేసుల్లో స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ.. ఈ కారణాలతో కట్టడి చర్యల్ని కొనసాగించాల్సి ఉందని తెలిపింది. 

86 నమూనాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్..

ఆగస్టు 9 నాటికి భారత్‌లో 86 నమూనాల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. వాటిలో 34 మహారాష్ట్రలోనే వెలుగుచూశాయని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. 28 వేల కేసులు, 373 మరణాలు నమోదయ్యాయి. వాటిలో మార్చి నాటి తగ్గుదల కనిపిస్తోంది. క్రియాశీల కేసులు నాలుగు లక్షల దిగువకు చేరాయి. ఇప్పటివరకు 51 కోట్ల మందికి టీకా డోసులు అందాయని కేంద్రం తెలిపింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని