కేరళలో మరో 44 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

కేరళలో  ఒకే రోజు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో  అత్యధికంగా కేసులు వెలుగుచూడటం మొదటి సారి కాగా ఇప్పటి వరకు మొత్తం 107...

Published : 31 Dec 2021 20:21 IST

తిరువనంతపురం: కేరళలో ఒకే రోజు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధికంగా కేసులు వెలుగుచూడటం ఇదే మొదటి సారి కాగా.. ఇప్పటి వరకు మొత్తం 107  మందికి ఒమిక్రాన్‌ సోకినట్లు నిర్ధారించారు. ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన విదేశీయుల నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు. ప్రస్తుతం కేసుల నమోదులో తక్కువ, ఎక్కువ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన విదేశీయులకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తెలిపారు.

తక్కువ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం స్వీయ పర్యవేక్షణను సూచించినప్పటికీ వారు షాపింగ్‌మాల్స్‌కు వెళ్లడం, సమావేశాలకు హాజరుకావడం, వారి కుటుంబ సభ్యులతో కలవడం వంటి కారణాలతో పాజిటివ్‌ కేసులు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన రెండు ఒమిక్రాన్‌ కేసులకు సంబంధించిన బాధితులకు ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని, విదేశాల నుంచి వచ్చిన వారితో కూడా ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. కొవిడ్‌గా నిర్ధారణ అయిన కేసులను నిశితంగా గమనిస్తూ ఒమిక్రాన్‌ సందేహంతో పరీక్షల కోసం జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒక్క కేసు కూడా ఒమిక్రాన్‌గా నిర్ధారణ జరగలేదని, ఇది ఉపశమనం కల్గించే అంశమని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల నమోదవుతుండగా కేరళలో గతంతో పోలిస్తే కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోందని మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని