Kerala: కేరళకు దెబ్బ మీద దెబ్బ!

కేరళలో ఓవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పాటు జికా వైరస్‌ కూడా కలకలం రేపుతోంది.

Published : 12 Jul 2021 10:14 IST

ఓవైపు కొవిడ్‌ ఉద్ధృతి.. మరోవైపు జికా

తిరువనంతపురం: కేరళలో ఓవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పాటు జికా వైరస్‌ కూడా కలకలం రేపుతోంది. గత ఏడాది కరోనాను నియంత్రించడంలో ‘మోడల్‌’గా మారిన కేరళలో ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజుకు 12-15 వేల మధ్య కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకు మొత్తం 30.39 లక్షల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,13,115కి చేరింది. పలు కొవిడ్‌ నిబంధనలను సడలించడం (అన్‌లాక్‌) వల్లే కేసులు పెరుగుతున్నాయని.. క్రమేపీ తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ చెబుతున్నారు. కేరళలో కొవిడ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 1న 19,760 రోజువారీ కేసులు నమోదు కాగా వారం రోజుల్లో ఆ సంఖ్య 9,313కి తగ్గింది. మళ్లీ రెండు రోజులకే 16,204కి పెరిగింది. నెల రోజుల తర్వాత కూడా (జులై 11న) 14 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే కేసుల సంఖ్య వైద్య వసతులపై ఒత్తిడి పెంచేస్థాయిలో లేకపోవడం వల్ల మహమ్మారిపై పోరాడగలుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇలా ఎక్కువ కాలం కొనసాగితే అది వైద్యులపైన, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపైనా మరింత ఒత్తిడి పెంచుతుందని చెబుతున్నారు. కొవిడ్‌ నియంత్రణకు కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాత్రం వారంతా అభినందిస్తున్నారు. ఈ చర్యలు ఇన్‌ఫెక్షన్‌ రేటు అత్యంత తీవ్రదశకు చేరకుండా నిలువరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమని, టీకాల సేకరణకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కడా గుమిగూడకుండా చూడాలని నొక్కి చెబుతున్నారు. వీధుల్లోకి వస్తే మాస్కులు తప్పక ధరించాలని స్పష్టం చేస్తున్నారు. కేసులు తగ్గకపోవడానికి ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించకపోవడం ఒక కారణమని వైరాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 జికా వైరస్‌ కేసులు బయటపడటం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని కూడా పంపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని