Jaishankar: ‘రక్షణ ఛత్రంలోనే ముంబయి ఉగ్ర దాడుల సూత్రధారులు’

26/11 ముంబయి ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారులు, ప్రణాళికాకర్తలు నేటికీ రక్షణాఛత్రంలో ఉన్నారని, వారిని ఇంతవరకు శిక్షించలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Published : 28 Oct 2022 19:36 IST

ముంబయి: 26/11 ముంబయి(Mumbai Attacks) ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారులు, ప్రణాళికాకర్తలు నేటికీ రక్షణాఛత్రంలో ఉన్నారని, వారిని ఇంతవరకు శిక్షించలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(Jaishankar) అన్నారు. ఐరాస భద్రతా మండలి(UNSC) ఉగ్రవాద నిరోధక కమిటీ ఆధ్వర్యంలో ‘ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త, అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతల వినియోగాన్ని ఎదుర్కోవడం’ అంశంపై ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజకీయ అంశాల కారణంగా.. కొంతమంది ఉగ్రవాదులపై నిషేధం విధించే విషయంలో యూఎన్‌ఎస్‌సీ చర్యలు తీసుకోలేకపోవడం విచారకరమని పరోక్షంగా చైనాను ఉద్దేశించి విమర్శలు చేశారు.

అంతకుముందు.. ముంబయిలోని తాజ్ హోటల్‌లో 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జైశంకర్‌తోపాటు యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా నివాళులర్పించారు. ఈ ఉగ్రదాడి కేవలం ముంబయిపైనే కాదు.. అంతర్జాతీయ సమాజంపై జరిగిన దాడి అని జైశంకర్‌ పేర్కొన్నారు. ‘26/11 ఉగ్రదాడి జరిగి 14 ఏళ్లు కావొస్తుంది. అయితే, దీని వెనుక సూత్రధారులు.. రాజకీయ మద్దతు నీడలో ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారు. ఇది సామూహిక విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పు’ అని అన్నారు. ‘ఈ మారణహోమంలో ప్రాణాలతో బయటపడిన వారి గొంతులను విన్నాం. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో యూకే విదేశాంగ శాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ మాట్లాడుతూ తాము ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌, మా అంతర్జాతీయ మిత్రులు, భాగస్వాములతో కలిసి ‘ముంబయి దాడులు’ వంటివి మరోసారి జరగకుండా అడ్డుకొంటామన్నారు. నేడు జరుగుతున్న సమావేశం ప్రాణాల విలువ, ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం ప్రభావాన్ని తెలియజేస్తోందన్నారు. సమష్టిగా ఉగ్రవాదాన్ని ఓడించడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు