Updated : 02 May 2021 18:12 IST

Lockdown తప్పనిసరి అవుతుందా..?

నిపుణులు ఏమంటున్నారంటే..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మరి విలయతాండవం చేస్తోన్న వేళ.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించడంపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొత్త మ్యుటేషన్లతో విరుచుకుపడుతోన్న మహమ్మారిని కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో స్థానికంగా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నప్పటకీ ప్రస్తుత చర్యల ద్వారా వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకోవడం కష్టమేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్నిరోజులు లాక్‌డౌన్‌ విధిస్తేనే మహమ్మారి కట్టడి సాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కఠిన ఆంక్షలు అవసరమే: నిపుణుల కమిటీ

దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 4 లక్షల కేసులు, మూడున్నర వేల మరణాలు నమోదవుతున్నాయి. విస్తృత వేగంతో వ్యాప్తిచెందే కొత్తరకం కరోనా విజృంభణను నియంత్రించడం అన్ని రాష్ట్రాలకు కష్టంగా మారుతోంది. కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్‌ కేసులతోపాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరగడం, కొత్తరకాల ఉద్ధృతితో ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఓవైపు ఆక్సిజన్‌ పరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను ఒకేసారి పెంచడం సాధ్యం కాదని.. కనీసం రెండు వారాలపాటు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగితే కొవిడ్‌ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవ్చని నిపుణులు భావిస్తున్నారు. వైరస్‌ కట్టడికి ప్రస్తుతం రాష్ట్రాలు అవలంభిస్తోన్న చర్యలు సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాని.. కొవిడ్‌పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించనప్పటికీ, అంతర్గత సమీక్షలు, పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నిపుణులు ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఇక రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లతో పెద్దగా ఉపయోగం లేదని.. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్‌డౌన్‌ అవసరమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించడానికి గల మూడు కీలకాంశాలను నిపుణులు ప్రస్తావిస్తున్నారు..

సామాజిక వ్యాప్తి ఉన్నప్పుడు..

కరోనా వైరస్‌ కేవలం కొందరి వ్యక్తుల్లోనే కాకుండా సామాజిక వ్యాప్తిగా ఉన్నప్పుడు టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ట్రాకింగ్‌ వంటి చర్యలు సత్ఫలితాలివ్వవు. ఎందుకంటే ఎవరిని ట్రేస్‌ చేసి పరీక్షించాలో కూడా తెలియని పరిస్థితి. ప్రతిఒక్కరికీ వైరస్‌ ఉన్నట్లు అనుమానించి పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం. ఇలాంటి సమయాల్లో లాక్‌డౌన్‌ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి ఉంటుంది. చాలా దేశాలు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని కొవిడ్‌పై కేంద్రం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

తీవ్ర ఒత్తిడిలో ఆరోగ్య సిబ్బంది..

దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న తరుణంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే వాదన మొదలైంది. ముఖ్యంగా ఆస్పత్రుల బయట అంబులెన్సులు క్యూ కడుతుండడం, రోగుల బందువుల రోదనలు, ఆక్సిజన్‌ కొరతతో వైద్యఆరోగ్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా చాలా మంది వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా వైరస్‌ బారినపడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌లోని మరో నిపుణుడు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలపై ఆందోళన..

మెరుగైన వైద్య సదుపాయాలున్న నగరాల్లోనే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఉద్ధృతి కొనసాగితే వీటిని తట్టుకునేందుకు గ్రామాలు సిద్ధంగా లేవు. ముఖ్యంగా వైద్యారోగ్య సిబ్బంది, మౌలిక వసతులు సరిపోవని నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు. అందుచేత గ్రామాల్లో తీవ్రత పెరగకుండా నిరోధించడమే ముఖ్యమని స్పష్టంచేస్తున్నారు.

లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులే..అయినప్పటికీ..!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం ఆర్థిక వ్యవస్థతోపాటు పేద, వెనకబడిన వర్గాలకు ఎంతో ఇబ్బందిగా మారుతుందని టాస్క్‌ఫోర్స్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వలస కూలీలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అయినప్పటికీ ఇలాంటి పెను ఉప్పెనను అదుపులోకి తీసుకురావడానికి ఆమోదయోగ్యమైన శాస్త్రీయ విధానం లాక్‌డౌన్‌ ఒక్కటేనని టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల్లో మరొక నిపుణుడు అభిప్రాయపడ్డారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి చాలా దేశాలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఫౌచీ నోట అదేమాట..

భారత్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి తక్షణం కొద్ది వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాలని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచించారు. వైరస్‌ను కట్టడి చేయడానికి తక్షణ, మధ్యమ, దీర్ఘకాలిక చర్యలు అవసరమంటూ గతంలో తాను చెప్పిన విషయాలను ఆయన గుర్తుచేశారు. అలాగని 6 నెలల పాటు విధించాల్సిన అవసరం లేదని.. వైరస్‌ సంక్రమణాన్ని నిరోధించడానికి తాత్కాలికంగా లాక్‌డౌన్‌ అవసరమని ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.

చివరి ఆయుధం మాత్రమే కావాలి: ప్రధాని మోదీ

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నవేళ.. స్థానికంగానే వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. తుపానులా వచ్చి విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారిని మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ద్వారా నియంత్రించాలని పదిరోజుల క్రితం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో సూచించారు. వైరస్‌పై చేస్తోన్న యుద్ధంలో ‘లాక్‌డౌన్‌’ అనేది చివరి ప్రయత్నంగా ఉండాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

ఇలా ప్రధానితో పాటు వైద్య ఆరోగ్య నిపుణుల సూచనలకు అనుగుణంగా వైరస్‌ తీవ్రత ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోనూ పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఒడిశా, అస్సాం, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌లోనూ రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో సినిమా, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌, ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నా కొద్దీ రాష్ట్రాలు మరిన్ని ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని