Delhi : దిల్లీకి ఖలిస్థానీ ఉగ్ర ముప్పు.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు

దేశ రాజధానిలో ఖలిస్థానీ ఉగ్ర సంస్థ మెల్లగా పడగవిప్పుతోంది. తాజాగా ఆ సంస్థకు మద్దతుగా తరచూ పోస్టర్లు వెలుస్తున్నాయి. 

Updated : 29 Jan 2023 13:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలో ఖలిస్థాన్‌ ఉగ్ర నెట్‌వర్క్‌ స్లీపర్‌ సెల్స్‌ చురుగ్గా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెలువరించింది. ఇటీవల కాలంలో దిల్లీలోని చాలా చోట్ల  ఖలిస్థాన్‌కు మద్దతుగా పెయింటింగ్‌లు, గోడలపై రాతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వికాశ్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్‌ విహార్‌, పీరాగర్హ, పశ్చిమ దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి రాతలు కనిపించడంతో.. పోలీసులు వెంటనే వీటిని తొలగించారు. దిల్లీలో ఈ ఉగ్రసంస్థ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇటీవల రిపబ్లిక్‌ డే రోజు దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఖలిస్థాన్‌ పోస్టర్లు వెలిశాయి. సిక్‌ఫర్‌ జస్టిస్‌, ఖలిస్థానీ జిందాబాద్‌, రెఫరెండం 2020 వంటి నినాదాలతో ఇవి ఉన్నాయి. వీటిని అంటించిన వారిని ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇప్పటికే పోలీసులు వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే పోలీస్‌ పెట్రోలింగ్‌, సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153 బీ, నేరపూరిత కుట్ర 120 బీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు సిక్‌ ఫర్‌ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థకు చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. రిపబ్లిక్‌ డే రోజున ప్రత్యేక పంజాబ్‌ (Punjab) అనుకూల సంస్థ ఎస్‌ఎఫ్‌జే (SFJ) ఉగ్రదాడులకు పాల్పడుతుందన్నది దాని సారాంశం. ‘‘జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిల్లీనే మా లక్ష్యం. అదే రోజున ఖలిస్థాన్‌ జెండాను ఆవిష్కరిస్తాం’’ అని గురుపత్వంత్‌ సింగ్‌ వీడియోలో చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని