Rahul Gandhi: రాహుల్‌ సభలో ఖలిస్థానీ మద్దతుదారుల హల్‌చల్‌..

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీకి ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా.. కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు సభలో నినాదాలు చేశారు.

Published : 31 May 2023 16:24 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అమెరికా సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు హల్‌చల్‌ చేశారు. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అమెరికా (USA) పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ.. కాలిఫోర్నియాలో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ‘మొహబత్‌ కి దుకాణ్‌ (ప్రేమ దుకాణాలు)’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. సభలో కూర్చున్న కొందరు ఖలిస్థానీ సానుభూతిపరులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ.. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే, ఆ నినాదాలకు రాహుల్‌ స్పందిస్తూ.. ‘‘విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు’’ అని అన్నారు. ఆ వెంటనే సభలోని కాంగ్రెస్‌ మద్దతుదారులు భారత్‌ జోడో అంటూ నినాదాలు చేశారు. అనంతరం దీనిపై రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి ప్రతి ఒక్కరిపైనా అభిమానం ఉంటుంది. మేం ఎవరి పట్లా కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించబోం. ప్రతి వ్యక్తి ఆవేదనను వింటాం’’ అని అన్నారు.

అయితే, రాహుల్‌ మాట్లాడుతుండగా ఖలిస్థానీ సానుభూతిపరులు నినాదాలు చేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోను భాజపా నేత అమిత్ మాల్వియా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘1984 నాటి మారణహోమానికి స్పందనే ఇది. మీరు రాజేసిన విద్వేష అగ్ని.. ఇప్పటికీ మండుతూనే ఉంది’’ అని కాంగ్రెస్‌ నేతను దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని