ఆ విగ్రహాలను యథాతథ స్థానాల్లోకి తీసుకురండి: కాంగ్రెస్ డిమాండ్

పార్లమెంటులో మహనీయుల విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. 

Updated : 19 Jun 2024 19:25 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. వాటిని యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనిపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌కు హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. దానిని ఎక్స్‌ (ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ‘‘మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్‌తో సహా ఇతర జాతీయ నాయకుల విగ్రహాలను మునుపటి స్థానాల్లోకి మార్చండి. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా విగ్రహాల తొలగింపు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుంది’’ అని అన్నారు.

ఇదివరకే ఈ విమర్శలపై 17వ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని చెప్పారు. ‘‘అన్నింటినీ ఒక్కచోట చేరిస్తే వారివారి జీవితచరిత్ర, సాధించిన విజయాలపై సమాచారాన్ని ప్రజలు మెరుగ్గా తెలుసుకోగలరనే అభిప్రాయం అనేకమందిలో ఉండేది. అందుకే పార్లమెంటు పాత భవనం, గ్రంథాలయం మధ్యనున్న ప్రేరణాస్థల్‌కు వాటిని తరలించాం. ఈ స్థలంలో ఏడాది పొడవునా సందర్శకులను అనుమతిస్తాం. జాతి నిర్మాణానికి మహనీయులు చేసిన కృషికి గుర్తింపుగా వారి జయంతి, వర్థంతిలను ఇక్కడ నిర్వహిస్తాం’’ అని చెప్పారు. వీరి జీవిత చరిత్ర, సందేశాలను సందర్శకులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకోగలిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వాటి తరలింపునకు ముందు అన్ని వర్గాలతో ఎప్పటికప్పుడు చర్చించామని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని