నావికాదళ సైనికుడి దారుణ హత్య!

మహారాష్ట్రకు చెందిన ఓ నావికాదళ సైనికుణ్ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఇదంతా వారు రూ.10 లక్షల కోసం చేసినట్లు విచారణలో తేలింది...........

Updated : 07 Feb 2021 12:12 IST

ముంబయి: మహారాష్ట్రకు చెందిన ఓ నావికాదళ సైనికుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఇదంతా వారు రూ.10 లక్షల కోసం చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాకు చెందిన సూరజ్‌ కుమార్‌ మిథిలేశ్‌ దూబే(27) భారత నావికాదళంలో నావికుడి(సెయిలర్‌గా)గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా ప్రస్తుతం ఆయన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఐఎన్‌ఎస్‌ అగ్రాణీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల సెలవుపై వెళ్లిన ఆయన తిరిగి విధుల్లో చేరేందుకు జవవరి 31న చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియని ముగ్గురు దుండగులు దూబేను అపహరించారు. దాదాపు మూడు రోజుల పాటు చెన్నైలోనే గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. అందుకు ఆయన నిరాకరించారు.

అనంతరం దుండగులు దూబేను పాల్‌ఘర్‌ జిల్లాలోని వెవేజీ గ్రామ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం కాళ్లు, చేతులు కట్టేసి ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయారు. మంటల్లో కాలుతూనే దూబే అక్కణ్నుంచి పరుగులు తీశారు. అతణ్ని గుర్తించిన కొందరు స్థానికులు ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే 90 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ముంబయిలోని నావికాదళ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే కన్నుమూశారు. చనిపోయే ముందు దూబే జరిగిందంతా పోలీసులకు వివరించారు.

ఇవీ చదవండి...

రూ.20 కోసం ఘర్షణ.. వ్యక్తి మృతి

‘నాతో గడిపితేనే మీ ఉద్యోగాలుంటాయ్‌..’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని