Kidnap: యూఎస్‌లో భారతీయ కుటుంబం దారుణ హత్య.. పంజాబ్‌లో విషాదఛాయలు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన భారత సంతతి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనతో పంజాబ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

Published : 07 Oct 2022 01:31 IST

హోషియార్పూర్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన భారత సంతతి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనతో పంజాబ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల స్వగ్రామం హర్షిపిండ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించిన కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే భారతీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని మెర్సిడెస్‌ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్దీప్‌ సింగ్‌ కుటుంబం ట్రక్కుల రవాణ వ్యాపారం చేస్తోంది. సోమవారం ఉదయం జస్దీప్‌ సింగ్‌ (36), ఆయన భార్య జస్లీన్‌ కౌర్‌ (27), తమ ఎనిమిది నెలల పాప ఆరూహి దేహ్రీతో పాటు చిన్నారి మామ అమన్‌దీప్‌ సింగ్‌ (39)ను ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకితో బెదిరించి ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్‌ చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసుల బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్డు, హచిన్సన్‌ రోడ్డు సమీపంలోని ఓ తోటలో వీరి మృతదేహాలను గుర్తించారు. ఈ వార్త తెలియడంతో పంజాబ్‌లోని వారి స్వగ్రామం హర్షిపిండ్‌తో పాటు పాటు సమీప గ్రామల్లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక ప్రజలు జస్దీప్‌ నివాసానికి చేరుకొని వారి తల్లిదండ్రులను పరామర్శించేందుకు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు. 

జస్దీప్‌ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైరయ్యారు. తమ పిల్లలు కిడ్నాప్‌కు గురైన వార్త తెలియగానే ఆ దంపతులిద్దరూ అమెరికా బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై హర్షిపిండ్‌ సర్పంచ్‌ సిమ్రాన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటన గురించి తెలియగానే గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. జస్దీప్ తండ్రి రణ్‌ధీర్‌ సింగ్‌ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో జనం వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. రణ్‌ధీర్‌ సోదరి ఇల్లు తెలిసినవారు అక్కడికి వెళ్లి తమ సానుభూతి తెలుపుతున్నారు. విదేశాలకు వెళ్లే భారతీయులకు భద్రత ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ దారుణానికి పాల్పడిన దోషులకు కఠిన శిక్షలు విధించాలి’’ అని తెలిపారు.

పంజాబ్‌ సీఎం, కేంద్రమంత్రి దిగ్భ్రాంతి

ఈ ఘటనపై కేంద్రమంత్రి,  ఎంపీ సోం ప్రకాశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకోవైపు, ఈ ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, శిరోమణి అకాలీద్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రానికి చెందిన కుటుంబం అమెరికాలో హత్యకు గురికావడం పట్ల ఉన్నత స్థాయి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని