North Korea: ఆహార సంక్షోభంపై ‘కిమ్‌’ ఆందోళన!

ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 16 Jun 2021 17:12 IST

మరికొంత కాలం లాక్‌డౌన్‌ ఆంక్షలు

సియోల్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సమయంలో.. ఉత్తర కొరియాలో ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ అక్కడి పరిస్థితులపై ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా వీటిపై తొలిసారి పెదవి విప్పిన ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుంచి బయటపడేందుకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనుగొనాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం పొడిగిస్తున్నందున వాటికి సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు.

ఆహార, ఆర్థిక సంక్షోభంతో సతమతం..?

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంటున్న ఉత్తర కొరియా, దేశ సరిహద్దులను మూసివేయడంతో పాటు కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. ముఖ్యంగా చైనాతోనూ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించింది. దీంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించినట్లు సమాచారం. అంతేకాకుండా గత వేసవికాలంలో అక్కడ సంభవించిన తుపానులు, వరదలతో పంటలు నాశనం కావడంతో ఉత్తరకొరియా ఉక్కిరిబిక్కిరైంది. ఇలా వరుస ప్రభావాలతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కోనుందని దక్షిణ కొరియా థింక్‌ట్యాంక్‌ కొరియా డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈమధ్యే వెల్లడించింది. దీంతో దేశ ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వ్యవసాయ ఉత్పత్తులను పెంచండి..

ప్రస్తుతం దేశ ఆర్థిక, ఆహార పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తాజాగా ప్రారంభమైన పార్టీ ప్లీనరీ సమావేశంలో అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొనడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఆహార కొరత, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలను మరికొంత కాలం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలకు కిమ్‌ సూచించారు. వీటితో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపై ఉత్తరకొరియా ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులతో చర్చించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA వెల్లడించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని