కిమ్‌ సామ్రాజ్యంలో కరోనా లేదట..!

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో యావత్‌ ప్రపంచం అల్లాడిపోతోంది. అయినప్పటికీ కిమ్‌ సామ్రాజ్యంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదట.

Published : 07 Apr 2021 18:12 IST

క్వారంటైన్‌ వివరాలు ఇవ్వడం లేదన్న WHO
మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం: అంగీకరించిన కిమ్‌

ప్యాంగ్యాంగ్: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో యావత్‌ ప్రపంచం అల్లాడిపోతోంది. అయినప్పటికీ కిమ్‌ సామ్రాజ్యంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదట. ఇదే విషయాన్ని తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)కు ఉత్తర కొరియా తెలియజేసింది. అయితే, కరోనా కేసులు, క్వారంటైన్‌ వివరాలను మాత్రం ఉత్తర కొరియా వెల్లడించ లేదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొనడం గమనార్హం. ఇక కరోనా తీవ్రత దృష్ట్యా టోక్యో ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలని ఉత్తర కొరియా నిర్ణయించిన విషయం తెలిసిందే.

సరైన వివరాలు ఇవ్వడం లేదు: WHO

‘కరోనా వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 23,121 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఉత్తర కొరియా నివేదించింది. వీటి ఫలితాలన్నీ నెగటివ్‌గానే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు’ అని ఉత్తర కొరియా డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఎడ్విన్‌ సాల్వడార్‌ వెల్లడించారు. అయితే కరోనా లక్షణాలున్న  ఎంతమందిని క్వారంటైన్‌లో ఉంచారనే విషయంపై ఉత్తర కొరియా సరైన సమాచారం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

మునుపెన్నడూ లేని సంక్షోభం..

కరోనా వైరస్‌ విషయంపై ఉత్తర కొరియా తొలి నుంచి అత్యంత గోప్యత ప్రదర్శిస్తోన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ధృఢమైన వాణిజ్య బంధమున్న చైనాలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోన్న తరుణంలోనూ అక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. సరిహద్దు దక్షిణ కొరియాలోనూ వైరస్‌ తీవ్రత ఉన్నప్పటికీ ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు వెలుగు చూడకపోవడం పట్ల అంతర్జాతీయంగా ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. కరోనా వైరస్‌ అంటేనే భయంతో వణికిపోతోన్న కిమ్‌ సామ్రాజ్యం.. వీటిపై ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇస్తుందనే వాదనలూ ఉన్నాయి. దేశంలో కరోనావైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఉ.కొరియా అధినేత కిమ్‌ తొలినుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారని అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, ఉత్తర కొరియా మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఓ సమావేశంలో అంగీకరించినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ(KCNA) వెల్లడించింది.

ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా 13కోట్ల మందిలో ఇప్పటికే వైరస్‌ బయటపడగా, వీరిలో దాదాపు 30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన దశలోనే అప్రమత్తమైన ఉత్తర కొరియా, దేశ సరిహద్దులను మూసివేసింది. పర్యాటకులపై నిషేధంతో పాటు వివిధ దేశాల వాణిజ్యంపైనా ఆంక్షలు విధించింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి మాత్రమే వాణిజ్యాన్ని కొనగిస్తోంది. ఇలా దేశంలోకి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు దేశంలో కొవిడ్‌ లక్షణాలున్న వారిని క్వారంటైన్‌లో ఉంచుతోంది. ఇలా ఇప్పటి వరకు వేల మందిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షించినట్లు సమాచారం. అయినప్పటికీ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా వెలుగుచూడలేదని ఉత్తర కొరియా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని