King Charles III: రైలు ప్రమాదం నన్నెంతో కలచివేసింది!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) తమను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ III (King Charles) పేర్కొన్నారు.

Published : 06 Jun 2023 00:16 IST

లండన్‌: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) తమను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ III (King Charles) పేర్కొన్నారు. దీనిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన సందేశాన్ని పంపించారు. ఈ సందర్భంగా 43 ఏళ్ల క్రితం ఒడిశాలో పర్యటించిన జ్ఞాపకాలను కింగ్‌ ఛార్లెస్‌ III గుర్తుచేసుకున్నారు.

‘బాలేశ్వర్‌లో చోటుచేసుకున్న భయంకరమైన రైలు ప్రమాద వార్త విని నేను, నా భార్య (రాణి కెమిల్లా) ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భారత ప్రజలకు మా హృదయాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో మీకు తెలుసునని ఆశిస్తున్నా. 1980లో ఒడిశాలో పర్యటించి అక్కడి వారితో కలిసిన  జ్ఞాపకాలు నాకు గుర్తున్నాయ్‌. ఈ విషాదంతో బాధితులుగా మిగిలిన ప్రతిఒక్కరి కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఒడిశా ప్రజల కోసం’ అని రాజు ఛార్లెస్‌ III చెప్పినట్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది.

మరోవైపు, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో 77 మృతదేహాలను మాత్రమే వారి కుటుంబీకులకు అప్పగించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. గాయపడిన వారిలో ఇప్పటివరకు చాలామంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి కాగా.. మరో 198 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక్కరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని