Saina Nehwal: సైనాపై సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. స్పందించిన కేంద్రమంత్రి రిజిజు

దేశానికే గర్వకారణమైన సైనా నెహ్వాల్‌పై చేసిన అటువంటి వ్యాఖ్యలు వారి సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు మండిపడ్డారు.

Published : 12 Jan 2022 01:28 IST

దిల్లీ: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు స్పందించారు. దేశానికే గర్వకారణమైన సైనా నెహ్వాల్‌పై చేసిన అటువంటి వ్యాఖ్యలు వారి సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే సిద్ధార్థ్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌తోపాటు పలు రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

‘క్రీడారంగంలో భారత్‌ను బలమైన శక్తిగా మార్చడంలో సైనా నెహ్వాల్‌ చేస్తోన్న కృషి దేశానికే గర్వకారణం. ఒలింపిక్‌ పతకం సాధించడమే కాకుండా ఆమె ఒక నిజమైన దేశభక్తురాలు. అటువంటి ప్రముఖ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఓ వ్యక్తి సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తోంది’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయశాఖ బాధ్యతలు చేపట్టిన కిరెన్‌.. అంతకుముందు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, ఇటీవల ప్రధాని పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనను ప్రస్తావిస్తూ సైనా నెహ్వాల్‌ చేసిన ట్వీట్‌పై సిద్ధార్థ్‌ రీట్వీట్‌ చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా సిద్ధార్థ్‌ వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు మొదలయ్యాయి. వీటిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, గాయని చిన్మయి శ్రీపాద తోపాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ).. సిద్ధార్థ్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌కు, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖలు రాసింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు కూడా సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని