Kiren Rijiju: అది శిక్ష కాదు.. మోదీ విజన్‌: మంత్రిత్వ శాఖ మార్పుపై కిరణ్‌ రిజిజు వ్యాఖ్య

శనివారం కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు(Kiren Rijiju) భూవిజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఈ మార్పు ప్రభుత్వ ప్రణాళికలో భాగమని చెప్పారు.  

Published : 19 May 2023 18:42 IST

దిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు(Kiren Rijiju)ను న్యాయశాఖ నుంచి తప్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు భూవిజ్ఞానశాస్త్ర శాఖను అప్పగించారు. తాజాగా కొత్త శాఖ బాధ్యతలు స్వీకరించిన రిజిజు.. ఈ మార్పులన్నీ మోదీ విజన్‌లో భాగమని వ్యాఖ్యానించారు.

‘ఈ మార్పు శిక్ష కాదు. అది ప్రభుత్వ ప్రణాళికలో భాగం. అది మోదీ(Modi)విజన్‌’అని అన్నారు. న్యాయశాఖమంత్రిగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థతో ఉన్న అభిప్రాయ బేధాలపై ప్రశ్నించగా.. ‘ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదు. నా గత మంత్రిత్వ శాఖ గురించిన ప్రశ్నలు వేయొద్దు. అవి ఇక్కడ సరికాదు. మోదీ నాకు అప్పగించిన కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే నా పని’అని అన్నారు. 

రిజిజు స్థానంలో రాజస్థాన్‌ నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి, మంత్రిమండలిలోని పార్లమెంటరీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌(Arjun Ram Meghwal)కు న్యాయశాఖను అప్పగించారు. మేఘ్వాల్‌ స్వతంత్రహోదాలో న్యాయశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తారని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మేఘ్వాల్‌ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు, కేంద్రానికి మధ్య ఎలాంటి ఘర్షణ లేదని వివరించారు.

ఇదిలా ఉంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన కిరణ్‌ రిజిజు(Kiren Rijiju) 2021, జులైలో న్యాయశాఖ మంత్రి బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు ఆయన మోదీ ప్రభుత్వంలో సహాయమంత్రిగా హోం, క్రీడాశాఖలను నిర్వహించారు. స్వతంత్ర హోదాలో మైనారిటీ వ్యవహారాలనూ చూశారు. న్యాయశాఖతో ఆయనకు కేబినెట్‌ హోదా లభించింది. అయితే, ఈ పదవిలో ఆది నుంచి వివాదాలను ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని