Racetrack: పవార్‌జీ.. కార్లు నిలిపేది అక్కడా?

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌, మహారాష్ట్ర మంత్రులు తమ కార్లను రేస్‌ట్రాక్‌పై పార్క్‌ చేయడం దుమారం రేపింది. ‘ఇది దురదృష్టకరం’ అంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 28 Jun 2021 15:08 IST

నేతల చర్యను ఖండించిన కిరణ్‌ రిజిజు

దిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌, మహారాష్ట్ర మంత్రులు తమ కార్లను రేస్‌ట్రాక్‌పై పార్క్‌ చేయడం దుమారం రేపింది. ‘ఇది దురదృష్టకరం’ అంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ప్రాజెక్టు సమీక్ష నిమిత్తం శనివారం పవార్, మహారాష్ట్ర మంత్రులు పుణెలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగింది. 

‘మనదేశంలో క్రీడలు, క్రీడానీతిని ఈ తరహాలో అగౌరవపర్చడం వ్యక్తిగతంగా తీవ్రంగా బాధించింది. దేశంలో తగినస్థాయిలో క్రీడా సౌకర్యాలు లేవు. ఉన్నవాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ నేతల చర్యను ఖండించారు. భాజపా నేత సిద్ధార్థ్‌ షిరోలే ట్వీట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై పుణె అధికారులు క్షమాపణలు చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర క్రీడావిభాగం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ..‘పవార్‌ సాహెబ్‌ నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మెట్లు ఎక్కాల్సి ఉంది. అందుకే ఆయన కారును మాత్రం సిమెంట్ ట్రాక్ వద్దకు అనుమతించాం. డ్యూటీలో ఉన్న సిబ్బందికి అదే విషయం చెప్పాం. దురదృష్టవశాత్తూ మిగతా కార్లు కూడా వరుసకట్టాయి. క్రీడా విభాగం తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. వీఐపీ సంస్కృతికి, మహా వికాస్ అగాఢీ అహంకారానికి ఈ చర్య నిదర్శనమని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని