Kiren Rijiju: కొలీజియంలో ప్రభుత్వాన్ని చేర్చండి.. సీజేఐకి కిరణ్‌ రిజిజు లేఖ

జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని, అందుకే కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) అన్నారు.

Updated : 16 Jan 2023 11:40 IST

దిల్లీ: న్యాయమూర్తుల నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియం (collegium)ల్లో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju).. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ (DY Chandrachud)కు లేఖ రాశారు.

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని రిజిజు ఈ సందర్భంగా సూచించారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం (collegium) వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లు ఇటీవల కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలతో కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయభేదాలు మొదలైన విషయం తెలిసిందే. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లుగా కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. 2014లో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ NJAC)ని కొట్టేయడం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని విమర్శించడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. అయితే ఈ విమర్శలకు సుప్రీంకోర్టు కూడా దీటుగా బదులిచ్చింది. కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ఎలా వచ్చిందీ కొలీజియం?

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం (collegium) పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ నిరోధించరని, కానీ ఆ సమయం వరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలంటూ కిరణ్‌ రిజిజు.. సీజేఐకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని