గుణపాఠం చెప్పడమూ రైతులకు తెలుసు: తికాయిత్‌ 

నూతన వ్యవసాయ చట్టాలపై భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయిత్‌ శనివారం మరోసారి కేంద్రానికి గట్టి హెచ్చరికలు చేశారు.

Published : 24 Jul 2021 23:19 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయిత్‌ శనివారం మరోసారి కేంద్రానికి గట్టి హెచ్చరికలు చేశారు. రైతులకు పార్లమెంటును నడిపించడమే కాదు.. తమను విస్మరించేవారికి గుణపాఠం చెప్పడమూ తెలుసంటూ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మూడు రోజులుగా రైతులు ‘కిసాన్‌ సంసద్‌’ను నిర్వహిస్తున్నారు.

సాగు చట్టాలను రద్దు చేయకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదంటూ రాకేశ్‌ తికాయిత్‌ ఈ నెల ప్రారంభంలో సర్కారును హెచ్చరించారు. ‘‘ప్రభుత్వం మా గోడు వినడంలేదు. కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకు మేము వెనకడుగు వేసేది లేదు. సర్కారు చర్చలకు రావాలి. అందుకోసం ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఇస్తున్నాం.  ప్రజాస్వామ్యయుత దేశంలో రైతుల సమస్యలను వినే ప్రభుత్వం లేదు. కానీ కేంద్రం మా డిమాండ్లను నెరవేర్చేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది’’ అని రాకేశ్‌ తికాయిత్‌ పేర్కొన్నారు.

దిల్లీ సరిహద్దుల్లో గతేడాది నుంచి దీక్ష చేస్తున్న సమయంలో రైతులు చనిపోయినట్లు ఎలాంటి నివేదికలూ లేవని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. కేంద్రం కొత్తగా తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాల నుంచి.. ప్రత్యేకించి పంజాబ్‌ హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి తరలి వచ్చిన వేలాది రైతులు ఎనిమిది నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు. వారిలో 200 మంది తాజాగా జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొంటున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని