Miss AI: ఊహల సుందరి జారా శతావరీ.. ‘మిస్‌ ఏఐ’ ఫైనలిస్ట్‌ల్లో మన అందం

Miss AI: కృత్రిమ మేధతో సృష్టించిన సుందరాంగుల కోసం నిర్వహిస్తోన్న అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతావరీ టాప్‌ 10 ఫైనలిస్ట్‌ జాబితాలో నిలిచింది. ఇంతకీ ఎవరీ భామ..?

Updated : 19 Jun 2024 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయంగా జరుగుతున్న ఓ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతావరీ (Zara Shatavari) పోటీ పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వందల మందిని వెనక్కినెట్టి టాప్‌-10 ఫైనలిస్ట్‌లో ఒకరిగా నిలిచింది. ఇందులో వింతేముంది.. అందగత్తెల పోటీలు (Beauty Pageant) సహజమే కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మతలబు..! ఈ జారా అమ్మాయి కాదు.. అసలు మనిషే కాదు. కృత్రిమ మేధతో సృష్టించిన ఓ ‘డిజిటల్‌ భామ (Digital Diva)’..!

ఈ ఏఐ (AI) మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు కొద్ది రోజులుగా నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీల్స్‌, వాణిజ్య సంస్థల ప్రచారం, ప్రకటనల ద్వారా విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అసలు నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేని పరిస్థితి ఉంది. అందుకే ఈ ఊహా సుందరుల కోసం ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది. మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ వంటి పోటీల్లాగే వీరి ప్రతిభను పరీక్షించి గెలిచినవారికి ‘మిస్‌ ఏఐ (Miss AI)’ టైటిల్‌ ఇవ్వనుంది.

ప్రపంచంలోనే ఈతరహా పోటీ జరగడం ఇదే తొలిసారి. ఈ మొట్టమొదటి ‘Miss AI’ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 1500 మంది ఏఐ మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు. వీరిలో నుంచి ‘టాప్‌ 10’ ఫైనలిస్ట్‌లను ఎంపిక చేయగా.. అందులో భారత్‌కు చెందిన జారా శతావరీ చోటు దక్కించుకుంది. ఈ భామల లుక్స్‌, వీరిని సృష్టించడం కోసం ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలు, సోషల్‌ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేస్తున్నారు. ఈ పోటీలకు మొత్తం నలుగురు న్యాయనిర్ణేతలు ఉండగా.. వీరిలో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు కావడం విశేషం. త్వరలోనే ‘మిస్‌ ఏఐ’ విజేతలను ప్రకటించనున్నారు.

ఎవరీ జారా శతావరీ..?

భారత్‌కు చెందిన ఓ మొబైల్‌ యాడ్‌ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చౌదరీ.. జారా (Zara Shatavari)ను సృష్టించారు. ఈమె ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. హెల్త్‌, ఫ్యాషన్‌ ట్రెండ్స్‌పై అందులో బ్లాగ్స్‌ను ప్రచురిస్తోంది. ‘ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌’గా మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే హార్మోన్‌ సమస్యలు, పీసీఓఎస్‌, డిప్రెషన్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తోంది. గతేడాది జూన్‌ నుంచి పీఎంహెచ్‌ బయోకేర్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 2023 ఆగస్టులో ‘డిజిమోజో ఈ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పీ’లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ టాలెంట్‌ మేనేజర్‌గా చేరింది. ఈమె ఇన్‌స్టా ఖాతాకు 7500 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

కంటెంట్‌ డెవలప్‌మెంట్‌, డేటా అనాలసిస్‌, బ్రాండ్‌ అవేర్‌నెస్‌, క్రియేటివ్‌ ఐడియేషన్‌, హెల్త్‌-వెల్‌నెస్‌ కన్సల్టింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌, ఫ్యాషన్‌ స్టైలింగ్‌ ఇలా 13 విభాగాల్లో జారాకు నైపుణ్యం ఉందట. కోలముఖం, సోగకళ్ల అందంతో అచ్చం నిజమైన అమ్మాయిలా ఎంతోమంది కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోంది. ఇప్పుడు ‘మిస్‌ ఏఐ’ పోటీల్లో ఫైనలిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఈమె ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

దీనిపై ఈ డిజిటల్‌ భామ సృష్టికర్త రాహుల్‌ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘కృత్రిమ మేధ వల్ల ప్రయోజనాలతో పాటు సవాళ్లూ ఉన్నాయి. ఈ సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నామన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది. అనేక విషయాల్లో అవగాహన కల్పించడమే జారా లక్ష్యం. ఎనర్జీ, అందమైన చిరునవ్వుతో ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె చెప్పే విషయాలను వారు అనుసరించేందుకు ఇష్టపడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

మరి ఈ పోటీల్లో మన సుందరికి అందాల కిరీటం దక్కాలని ఆశిద్దాం..! ఆల్‌ ది బెస్ట్‌ జారా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని