మార్కులు తగ్గాయని మాయమై.. రూ.కోటి ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్‌

పరీక్షల్లో మార్కులు తగ్గడంతో ఓ పదో తరగతి అమ్మాయి చేసిన పని పోలీసులను, ఆమె తల్లిదండ్రులను ఉరుకులుపెట్టింది. చివరకు అసలు నిజం తెలుసుకుని వారంతా కంగుతిన్నారు.

Published : 20 May 2023 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరీక్షల్లో మార్కులు తగ్గడంతో తల్లిదండ్రులు తిడతారని భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందో 16 ఏళ్ల బాలిక. వెంట ఆరేళ్ల చెల్లినీ తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా కిడ్నాప్‌ నాటకమాడి (Kidnap Drama).. తన తండ్రి నుంచి రూ.కోటి వసూలు చేసేందుకు ప్రయత్నించింది. పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata)లో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమబెంగాల్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు (10th class results) గత శుక్రవారం విడుదలయ్యాయి. దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థినికి ఈ పరీక్షల్లో 31 శాతం మార్కులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు తిడతారని భయపడిన ఆ బాలిక.. తనకు తాను కిడ్నాప్‌ డ్రామా అల్లింది. మార్కులు చూసుకునేందుకు ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్తానని చెప్పి ఆ బాలిక ఇంట్లో నుంచి బయటకెళ్లింది. తనతో పాటు ఆరేళ్ల తన చెల్లినీ తీసుకెళ్లింది. వారు ఎంతకీ తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.

అదే సమయంలో, బాలిక తండ్రికి గుర్తుతెలియని నంబరు నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. తన కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్‌ చేశామని, రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని దాని సారాంశం. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోం ఎదుట బాలికలను గుర్తించి కాపాడారు. అయితే, విచారణలో ఇదంతా డ్రామా (Kidnap Drama) అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ కిడ్నాప్‌ నాటకమాడినట్లు ఆ బాలిక అంగీకరించింది. తానే తన తండ్రికి రూ.కోటి ఇవ్వాలని మెసేజ్‌ చేసినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని