Updated : 10 Sep 2022 15:00 IST

ఆ విచారణ విరక్తి పుట్టించింది..అవమానంతో చితికిపోయా..!

కోల్‌కతా: బికినీ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టిన కారణంగా ఓ మహిళా ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన వార్త ఈ మధ్యకాలంలో వైరల్‌ అయింది. గత అక్టోబర్‌లోనే జరిగిన ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రొఫెసర్‌గా వైదొలిగిన మహిళ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థ చేపట్టిన విచారణతో తానెంతో నలిగిపోయానంటూ వాపోయారు.

‘‘గత అక్టోబర్‌లో విద్యాసంస్థ ‘కంగారు కోర్టు’లో నిర్వహించిన విచారణ నాకు విరక్తి, భయాన్ని పుట్టించాయి. అవమానంతో చితికిపోయా. నా ఇన్‌స్టాగ్రాం చిత్రాలను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. నేను ఇన్‌స్టా ఖాతాలో ఎంపిక చేసిన కొంతమందికి వాటిని షేర్ చేశాను. వాటిపై నన్ను గంటపాటు విచారించారు. బలవంతంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేశారు’’ అంటూ ఆవేదన చెందారు.

కోల్‌కతాలోని ప్రముఖ సెయింట్‌ జేవియర్స్‌ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్‌లో పట్టా పొందిన ఆమె.. తర్వాత ఎంఏ పూర్తి చేశారు. 2020లో యూరోపియన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు. తర్వాత తాను చదవిన జేవియర్స్‌ యూనివర్సిటీలోనే గత ఆగస్టులోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందారు. ఈ ఉద్యోగంతో కరోనా వేళ కోల్‌కతాలోని తన కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు అవకాశం ఏర్పడిందని ఆమె సంతోషించారు. తనకు ఇష్టమైన పాఠ్యాంశాలు బోధించేందుకు వీలు పడటంతో ఆనందపడ్డారు. కానీ..

‘అయితే చాలా త్వరగా ఈ ప్రయాణాన్ని దారుణంగా ముగించాల్సి వచ్చింది. అది ఇప్పటికీ కంపరమైన పీడ కలలాగే ఉంది. విచారణ సమయంలో వారు పేర్కొన్న ఫిర్యాదు నా వ్యక్తిత్వాన్ని తగ్గించి, నన్నొక చెడు మహిళగా చిత్రీకరించింది. విచారణ సమయంలో ప్యానెల్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. అది నన్ను ఇంకా బాధించింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి నా చుట్టూ కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. వారు తొలగించేవరకు వేచి చూడకుండా ఎందుకు రాజీనామా చేశావని కొందరు నన్ను ప్రశ్నించారు. నా స్థానంలో మీరు ఉండగలరా..? నేను వారిని అడుగుతున్నాను. నేను రాజీనామా చేయకపోతే.. ఈ చిత్రాలు ఉంచినందుకు క్రిమినల్‌ కేసు పెడతామన్నారు.

ఈ సమయంలో నేను, నా తండ్రి తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. నేను ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడ్డాను. నెలల వ్యవధిలో రెండుసార్లు నా తండ్రి ఆసుపత్రిలో చేరినా.. ఏ సహాయం చేయలేకపోయాను. ప్రస్తుతం దిల్లీలో ఒక ఉద్యోగంలో చేరినా.. గత పది నెలలు నాకొక పీడకలలా మిగిలిపోయాయి. కానీ న్యాయం కోసం నేను పడే తపన అలాగే మిగిలుంది’ అంటూ తాను అనుభవిస్తోన్న వేదనను వివరించారు. 

ముందేం జరిగిందంటే..?

సెయింట్‌ జేవియర్స్‌ యూనివర్సిటీకి చెందిన 18ఏళ్ల యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్రొఫెసర్‌ బికినీలో ఉన్న ఫొటోలు చూడటం అతడి తండ్రి గమనించారు. దీనిపై విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశారు. ‘ఫ్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫొటోలను నా కుమారుడు చూడటాన్ని గమనించాను. వాటిని చూసి నిర్ఘాంతపోయాను. ఒక అధ్యాపకురాలు లోదుస్తులు ధరించి సోషల్ మీడియాలో చిత్రాలను అప్‌లోడ్ చేయడం అవమానకరం. ఇలాంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తున్నారు. ఇది అసభ్యకరమైన చర్య, సరికాదు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. దాంతో ఆమె ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రెస్‌ కోడ్‌కు సంబంధించి తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఇన్‌స్టా  ప్రొఫైల్‌ కూడా ప్రైవేట్‌ ఖాతాయేనన్నారు. దాన్ని ఎవరో హ్యాక్‌ చేశారేమోనని, అందుకే ఆ ఫొటోలు లీకయ్యాయంటూ అదే నెలలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా తనను ఉద్యోగంలోనుంచి తొలగించారని, విద్యార్థి తండ్రి ఫిర్యాదు కాపీని ఇవ్వాలని కోరుతూ విశ్వవిద్యాలయానికి లీగల్ నోటీసు పంపారు. నోటీసుపై వర్సిటీ స్పందిస్తూ.. ఇది ‘చెడు ప్రేరేపిత’ చర్యగా పేర్కొంది. యూనివర్శిటీకి కోలుకోలేని నష్టం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, రూ.99 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తిరిగి ఆమెకే వర్సిటీ నోటీసులు పంపింది. పెద్దపెద్ద విద్యాసంస్థలు ఉద్యోగుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయమని ఆ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని