పుతిన్‌ బద్ధవిరోధిని ఆసుపత్రికి తరలిస్తాం: రష్యా

రష్యా అధ్యక్షుడికి బద్ధవిరోధి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీని ఆసుపత్రికి తరలిస్తామని ఆ దేశ జైళ్ల శాఖ వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ క్లిష్టంగానే ఉంది. ఖైదీలకు చికిత్స చేసే ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. 

Published : 19 Apr 2021 18:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడికి బద్ధవిరోధి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీని ఆసుపత్రికి తరలిస్తామని ఆ దేశ జైళ్ల శాఖ వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ క్లిష్టంగానే ఉంది. ఖైదీలకు చికిత్స చేసే ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. మాస్కో బయట జైలులో ఉన్న ఆయన మూడు వారాల క్రితం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ‘‘నవాల్నీని ఖైదీలకు చికిత్స అందించే కాలనీనెంబర్‌ 3లోని వైద్యశాలకు తరలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే ఉంది. ఆయన్ను వైద్యులు నిత్యం పరీక్షిస్తున్నారు’’ అని జైళ్ల శాఖ వైద్య బృందం ఒక ప్రకటనలో తెలిపింది. 

గతేడాది విషప్రయోగానికి గురైన నవాల్నీ జర్మనీలో చికిత్స పొంది, ఫిబ్రవరిలో తిరిగి రష్యాలో అడుగుపెట్టారు. ఆయన రాగానే పాతకేసుల్లో రష్యా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాజాగా కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వైద్య నివేదికలను పరిశీలిస్తే ఆయనలో పొటాషియం ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలుస్తోందన్నారు. ఇది ఏ క్షణంలోనైనా గుండెపోటుకు దారితీయొచ్చని పేర్కొన్నారు. అలాగే క్రియాటినైన్‌ స్థాయిలు సైతం విపరీతంగా పెరిగిపోయాయని.. ఇది కిడ్నీలు దెబ్బతిన్నాయడానికి సంకేతమని తెలిపారు.
‘‘నావల్నీ ఏ క్షణమైనా మరణించొచ్చు’’ అని ఆయన వ్యక్తిగత వైద్యుడు యారోస్లోవ్‌ అశిఖ్‌మిన్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొనడం సంచలనం  సృష్టించింది. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడే అలెక్సీ నావల్నీ. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. దాదాపు ఐదు నెలల పాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదంటూ తిరిగి రష్యాకు చేరుకున్న ఆయనను జనవరి 17న పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అనేక అవినీతి కేసులు మోపారు. కోర్టు ఆయనకు రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని