Lok Sabha: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

తమిళనాడులోని కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్‌ లోక్‌సభలో తెలుగులో ప్రమాణస్వీకారం చేసి ఆకట్టుకున్నారు.

Updated : 25 Jun 2024 18:41 IST

దిల్లీ: 18వ లోక్‌సభలో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు నుంచి ఎంపీగా గెలుపొందిన కె.గోపీనాథ్‌ తెలుగులో ప్రమాణస్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.  కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా విజయం సాధించిన ఆయన..  రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. చివరలో జై తమిళనాడు అని నినాదం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన సమయంలోనూ ఆయన తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా పలు అంశాలపై తెలుగులోనే అడగ్గా.. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చేవారు. 

మహారాష్ట్రకు చెందిన పలువురు సభ్యులు మంగళవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే ప్రమాణస్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి కాళ్లకు నమస్కరించారు. అనంతరం ఆమె భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా 262మందితో ప్రొటెం స్పీకర్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేయించగా.. మిగతా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని