Bengaluru: సీఎం గారూ.. ‘ప్రశాంత కర్ణాటక’ కోసం హెల్ప్‌లైన్‌ పెట్టండి: మంత్రి విజ్ఞప్తి

Peaceful Karnataka Helpline: ‘ప్రశాంత కర్ణాటక’ కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్‌ సీఎం సిద్ధరామయ్యను కోరారు.

Published : 05 Jun 2023 21:28 IST

బెంగళూరు: ‘ప్రశాంతమైన కర్ణాటక’(Peaceful Karnataka) కోసం ఓ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను పెట్టాలని మంత్రి ఎంబీ పాటిల్‌(MB Patil) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎవరూ విద్వేషాలను వ్యాప్తి చేయకుండా ఉండేందుకు గాను ఈ విధమైన ఏర్పాటు చేయాలని సోమవారం ఆయన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హోంమంత్రి పరమేశ్వరలకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు. తమ పార్టీ క్యాడెట్‌లను టార్గెట్‌ చేయడాన్ని అడ్డుకొనేందుకు గాను భాజపా ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తుందని బెంగళూరు దక్షిణ ఎంపీ, భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య చెప్పినట్టు వార్తలు రావడంతో మంత్రి ఈ విధమైన విజ్ఞప్తిని చేయడం గమనార్హం.  కర్ణాటకలో విద్వేషాలు వ్యాప్తి కాకుండా ఉండేందుకు ‘పీస్‌ఫుల్‌ కర్ణాటక’ పేరుతో కొత్త హెల్ప్‌లైన్‌ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు. తద్వారా అలాంటి ఘటనలను ట్రాక్‌ చేసేందుకు వీలుంటుందన్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎజెండా అభివృద్ధి, పురోగతి మాత్రమేనని.. కర్ణాటక బ్రాండ్‌ను పరిరక్షించడమేనని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు, భాజపా హయాంలో నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులకు కారణమయ్యారంటూ హిందుత్వ నేత, రచయిత చక్రవర్తి సులిబెలేకు మంత్రి ఎంబీ పాటిల్‌ ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం చేస్తే జైలుకు పంపుతామన్నారు. గత నాలుగేళ్లలో కలిగిన ఆటంకాలను తాము ఇప్పుడు సరిదిద్దుతున్నామన్నారు. పాఠ్యపుస్తకాల (సవరణ), హిజాబ్‌, హలాల్‌, అజాన్‌ వంటి అనవసర అంశాలను తెరపైకి తీసుకొస్తూ సృష్టించిన ఆటంకాలకు తాము ముగింపు పలుకుతామన్నారు. భవిష్యత్తులో ఈ రకమైన డ్రామాలకు తెరతీస్తే కటకటాల వెనుక గడపాల్సి వస్తుందని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు