Kendriya Vidyalayas: ఆ సమస్యకు కేవీలు ఒక్కటే పరిష్కారం కాదు: ధర్మేంద్ర ప్రధాన్‌

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల్లో పాఠశాలల్ని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.......

Published : 29 Mar 2022 02:39 IST

దిల్లీ: దేశంలోని విద్యా రంగంలో నెలకొన్న సమస్యలకు కేంద్రీయ విద్యాలయాలు (కేవీలు) ఒక్కటే పరిష్కారం కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల్లో పాఠశాలల్ని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న పాఠశాలల అప్‌గ్రేడ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.3500 కోట్లను సక్రమంగా వినియోగించుకొనేలా ఎంపీలు చొరవతీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. తమ నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు (కేవీలు) ఏర్పాటు చేయాలంటూ పలువురు ఎంపీల నుంచి వస్తోన్న డిమాండ్లపై లోక్‌సభలోని ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు.

దేశంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలకు కేంద్రీయ పాఠశాలల ఏర్పాటు ఒక్కటే పరిష్కారం కాదన్న ప్రధాన్‌.. రాష్ట్ర ప్రభుత్వాలూ తగిన మార్గాల్ని అన్వేషించాలని సూచించారు. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియ అన్నారు. అయితే, ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా బదిలీ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (రక్షణరంగ ఉద్యోగులతో పాటు పారామిలటరీ సిబ్బంది, కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూలు), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయర్‌ లెర్నింగ్‌ (ఐహెచ్‌ఎల్‌) విద్యా అవసరాల్ని తీర్చడమే లక్ష్యంగా ఏర్పాటైనవన్నారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనలోని మంత్రిత్వ శాఖలు/ విభాగాలు స్పాన్సర్‌ చేసి కొత్త కేవీల ఏర్పాటుకు వనరులు సమకూర్చినట్లయితేనే కొత్త కేవీలను పెట్టే ప్రతిపాదనలు పరిగణిస్తామన్నారు. కేవీలకు శాశ్వత భవనాల నిర్మాణం నిరంతర ప్రక్రియ అనీ.. ఇందుకోసం తగిన భూమిని గుర్తించడం, స్పాన్సర్ చేసే అధికారుల ద్వారా కేవీలకు అనుగుణంగా లీజు సంబంధిత ఫార్మాలిటీలను పూర్తి చేయడం, నిర్మాణ ఏజెన్సీ ద్వారా అంచనాల్ని సమర్పించడం, నిధుల లభ్యత, అవసరమైన అనుమతులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని