Lakhimpur Kheri: కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌..!

లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 10 Feb 2022 15:10 IST

లఖింపుర్‌ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న భాజపా నేత

లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు న్యాయస్థానంలో ఊరట లభించింది. అలహాబాద్‌ హైకోర్టు గురవారం నాడు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. లఖింపుర్‌ ఖేరి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన, గత అక్టోబర్‌ నెలలో అరెస్టయ్యారు. అనంతరం పలుమార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదలైన రోజే భాజపా నేత ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ లభించడం గమనార్హం.

గతేడాది అక్టోబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆశిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందడంతోపాటు అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిష్‌ మిశ్రాను పేర్కొన్న పోలీసులు.. అక్టోబర్‌ 9న ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, విచారణలో ఆశిష్‌ మిశ్రా సహకరించలేదని పోలీసులు వెల్లడించారు. అనంతరం పలుమార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో బెయిల్‌ కోసం ఆశిష్‌ మిశ్రా ప్రయత్నించినప్పటికీ ఆయనకు లఖింపుర్‌ ఖేరీ న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. తాజాగా మరోసారి బెయిల్‌ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న సమయంలోనే ఆయనకు బెయిల్‌ రావడం ఆసక్తిగా మారింది. యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరుగనుండగా.. లఖింపూర్‌ఖేరీలో నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని