Lakhmipur Kheri violence: ఇది తీవ్రమైన నేరం.. కానీ నిందితుడు పారిపోయే ప్రమాదం లేదు..!

లఖింపుర్ ఖేరి ఘటన తీవ్రమైందే అయినా.. ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా దేశం విడిచిపారిపోయే ప్రమాదం లేదని సోమవారం యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది.

Updated : 04 Apr 2022 15:00 IST

దిల్లీ: లఖింపుర్ ఖేరి ఘటన తీవ్రమైందే అయినా.. ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా దేశం విడిచిపారిపోయే ప్రమాదం లేదని సోమవారం యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అలాగే సాక్ష్యాలు తారుమారు కాకుండా సాక్షులకు భద్రత కల్పించామని  చెప్పింది. ఈ ఫిబ్రవరిలో ఆశిష్‌కు బెయిల్‌ మంజూరైంది. దానిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ కూడా బెయిల్‌ రద్దు చేయాలంటూ నివేదిక సమర్పించింది. కాగా, దీనిపై సుప్రీం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది.

‘ఈ నేరం చాలా దారుణమైంది. అయితే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనేది విచారణలో తేలుతుంది. మా వాదనలు విన్న తర్వాత కూడా అలహాబాద్‌ హైకోర్టు బెయిల్ రద్దు చేసింది.  ఏ కేసులో అయినా పదేపదే నేరాలు చేస్తే.. బెయిల్ మంజూరు చేయకూడదు. కానీ ఇది అలాంటి కేసు కాదు. అలాగే సాక్ష్యాలు తారుమారు కాకుండా.. సాక్షులకు రక్షణ కల్పిస్తున్నాం. ఇక నిందితుడు దేశం విడిచిపారిపోయే ప్రమాదం లేదు’ అంటూ యూపీ ప్రభుత్వం వెల్లడించింది. 

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో లఖింపుర్ ఖేరికి చెందిన రైతులు నిరసన తెలుపుతుండగా.. ఆశిష్‌కు చెందిన వాహన శ్రేణి వారిపై దూసుకువెళ్లింది. ఆ ఘటనలో నలుగురు చనిపోగా.. తర్వాత ఘర్షణల్లో మరో నలుగురు మరణించారు. గత అక్టోబర్‌లో ఈ ఘటన జరగ్గా.. కొద్దిరోజుల్లోనే ఆశిష్‌ అరెస్టయ్యారు. అయితే ఫిబ్రవరిలో అతడికి బెయిల్ మంజూరు కావడంతో బాధిత కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని