Helicopter Crash: కన్నకొడుకును తనివితీరా చూసుకోకుండానే..!

‘‘కొడుకు పుట్టాడు. వాడి మొదటి పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మంచి చదువు చెప్పిస్తాను. నాలాగే సైన్యంలో చేర్పించి గొప్ప సైనికుడిని చేస్తాను..’’

Updated : 11 Dec 2021 14:05 IST

చిన్నారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపిస్తానని చెప్పి వెళ్లి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘కొడుకు పుట్టాడు. వాడి మొదటి పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మంచి చదువు చెప్పిస్తాను. నాలాగే సైన్యంలో చేర్పించి గొప్ప సైనికుడిని చేస్తాను..’’ ఆరు నెలల క్రితం లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్ తన భార్యతో చెప్పిన మాటలివి. కానీ ఆ కల తీరకుండానే హెలికాప్టర్‌ దుర్ఘటన రూపంలో విధి ఆయనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఆరు నెలల పసికందుకు ఊహ తెలియని వయసులోనే నాన్నను దూరం చేసింది. 

తమిళనాడులో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో మృతిచెందిన 13 మందిలో వివేక్‌ కుమార్‌ ఒకరు. సీడీఎస్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ వ్యక్తిగత భద్రతాసిబ్బందిగా ఉన్న ఆయన.. విధి నిర్వహణలోనే కన్నుమూశారు. వివేక్ మరణ వార్త విని ఆయన కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది.

సెలవుపై వచ్చి కొడుకును చూసి..

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా థెహ్డూ గ్రామంలో 1993లో జన్మించిన వివేక్‌కు చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని ఆశ. అయితే ఇంటికి పెద్దకొడుకు కావడంతో ఆర్థిక బాధ్యతలు తప్పలేదు. అయినా వెనుకడుగు వేయకుండా 2012లో ఆర్మీలో చేరారు. రెండేళ్ల క్రితమే జనరల్‌ రావత్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమితులయ్యారు. కుటుంబం ఆర్థికంగా కుదురుకోవడంతో 2020లో ప్రియాంకతో ఆయనకు వివాహం జరిపించారు. ఆరు నెలల క్రితం ప్రియాంక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ ఆనందంలో నాలుగు నెలల క్రితమే విధుల నుంచి సెలవు తీసుకుని ఇంటికొచ్చారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఇప్పుడు ఎలాంటి వేడుక చేయబోనని, వచ్చే ఏడాది తన కొడుకు మొదటి పుట్టినరోజును ఘనంగా జరిపిస్తానని ఆ సమయంలో వివేక్‌ తన భార్య, కుటుంబసభ్యులకు తెలిపారు. కన్నకొడుకును తనివితీరా చూసుకోకుండానే.. వాడితో ఆడుకోవాలని ఉన్నా.. విధుల దృష్ట్యా గత నవంబరులో తిరిగి బాధ్యతల్లో చేరారు.

అదే చివరిమాట..

ప్రమాదం జరిగిన రోజు ఉదయం వివేక్‌ తన భార్య ప్రియాంకకు ఫోన్‌ చేశారు. కొడుకుతో కొంతసేపు ముచ్చటించి తాను తమిళనాడు వెళ్తున్నానని చెప్పారు. అదే అతని చివరి మాట అవుతుందని అనుకోలేదంటూ వివేక్‌ భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. వివేక్‌ మృతదేహాన్ని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించిన అధికారులు శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సాయంత్రం లేదా రేపు వివేక్‌ అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని