Corona:మహమ్మారి కట్టడికి లాన్సెట్‌ సూచనలు!

భారత్‌లో కరోనా రెండోదశ ఒక్కసారిగా విరుచుకుపడింది. వైద్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడింది. ఈ క్రమంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అనేక దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

Published : 26 May 2021 23:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా రెండోదశ ఒక్కసారిగా విరుచుకుపడింది. వైద్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడింది. ఈ క్రమంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అనేక దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే, గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో భారత్‌లో మహమ్మారి విజృంభణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌కు చెందిన సిటిజన్స్‌ కమిషన్‌ స్పందించింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ యామిని అయ్యర్‌ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్‌లో వ్యాసాన్ని ప్రచురించింది. 

కొవిడ్‌ కేసుల సంఖ్యకు, దేశంలో అందుబాటులో ఉన్న వైద్య వసతులకు ఎక్కడా పొంతన లేదని అభిప్రాయపడింది లాన్సెట్‌ కమిషన్‌. అందువల్ల సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించింది. తద్వారా ఔషధాలు, బెడ్లు, ఆక్సిజన్ వంటి వసతుల నిర్వహణలో ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి వరకు చేరేలా వైద్య సేవల్ని మరింత వికేంద్రీకరించాలని చెప్పింది. 

ఔషధాలు, వైద్య పరికరాల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వీటన్నింటి ధరలపై పరిమితి విధించాలని హితవు పలికింది. టెలీ మెడిసిన్ సేవల్ని మరింత విస్తృతం చేయాలంది. తద్వారా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యపరమైన మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపింది. ఈ క్రమంలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కొవిడ్‌ సేవలకు వినియోగించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. 

టీకాల కొనుగోలు, ఉచితంగా పంపిణీ కోసం ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని లాన్సెట్‌ కమిషన్‌ సూచించింది. అలాగే రానున్న రోజుల్లో కేసులు అధికమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా పూర్తిస్థాయి సమాచారాన్ని స్థానిక యంత్రాంగాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని