Updated : 03 May 2021 18:48 IST

Covid కట్టడికి Lancet సూచనలు!

లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌ తాజా నివేదిక

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించడంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ఎంపిక విధానం ఒక్కటే మార్గం కాదని.. పలు చర్యలతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరించాలని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌(భారత్‌) నివేదక అభిప్రాయపడింది. దేశంలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన పలు చర్యలను సూచించిన టాస్క్‌ఫోర్స్‌.. లాక్‌డౌన్‌ చర్యలకంటే మించి ఆలోచించాలని పునరుద్ఘాటించింది. అయితే, ఆర్థిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సమాజంలోని అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరమే చర్యలకు ఉపక్రమించాలని సూచించింది. ముఖ్యంగా వైరస్‌ కట్టడికి తీసుకునే చర్యల వల్ల ఆర్థికంగా నష్టపోయే వారికి వివిధ కార్యక్రమాలు, ఇతర రక్షణ కవచాలు ఉన్నాయనే భరోసా కల్పించాలని సూచించింది.

లాక్‌డౌన్‌ ఒకే విధానం కాకుండా..!

కరోనా వైరస్‌ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ విధించే ఒకే విధానాన్ని అమలుచేయడం కాకుండా సుదీర్ఘ వ్యూహంతో పలు చర్యలు చేపట్టాలని లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు వైరస్‌ కట్టడికి చర్యలతో పాటు సమన్వయ చర్యలు ఎంతో ముఖ్యమని టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. స్థానికంగా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నచోట కఠిన ఆంక్షలు అమలుతోబాటు వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నచోట కొంత మినహాయింపు ఇవ్వవచ్చని పేర్కొంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 30లక్షలు దాటడం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతుందని టాస్క్‌ఫోర్స్‌ నిపుణుల బృందం అభిప్రాయపడింది.

జోన్ల వారీగా ఆంక్షలు..

చాలా మంది చెబుతున్నట్లు ‘లాక్‌డౌన్‌’ అమలు చేయడం సరైన ఎంపిక కాదని భారత్‌లోని లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌ అభిప్రాయపడింది. ఒక్కో వారంలో వైరస్‌ తీవ్రత, పాజిటివిటీ రేటు, మరణాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని స్థానిక జోన్లుగా విభజించాలని పేర్కొంది. పాజిటివిటీ రేటు 2శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలను ‘తక్కువ ప్రమాదం’ ఉన్న జోన్లుగా ప్రకటించాలి. ఈ ప్రాంతాల్లో అన్ని రకాల వ్యవస్థలు 50శాతం సామర్థ్యంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక 5నుంచి 10శాతం పాజిటివిటీ, ఐసీయూ పడకల వినియోగం 40 నుంచి 80శాతం ఉన్న ప్రాంతాలను ‘మధ్యస్థ ప్రమాదం’ ఉన్న ప్రాంతాలుగా ప్రకటించాలి. ఇక్కడ మరిన్ని ఆంక్షలతో వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలి. ఇక పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ జోన్లుగా ప్రకటించాలి. ఈ జోన్లలో విద్యాసంస్థల వంటి వాటిని పూర్తిగా మూసివేయాలి. ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఫ్యాక్టరీలను 6 నుంచి 10వారాల వరకు మూసివేయాలి అని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. ఈ జోన్లలో వైరస్‌ సోకిన వారికి సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని స్పష్టంచేసింది.

వైద్య సదుపాయల సన్నద్ధత..

కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ.. వేల మంది ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ ప్రాధాన్యత అని లాన్సెట్‌ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం స్వల్ప, మధ్య స్థాయి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ కట్టడి సన్నద్ధతకు ఇంకా సమయం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ మరింత ప్రబలితే ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది, ఇంటర్న్‌షిప్‌లతో పాటు స్థానికులను సిద్ధం చేయాలని సూచించింది. ముఖ్యంగా జిల్లా స్థాయి ఆసుపత్రుల ప్రాంగణంలోనే ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దాదాపు 12 అంశాలను ప్రముఖంగా ప్రస్తావించిన లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌ వైరస్‌ కట్టడికి మరికొన్ని సూచనలు చేసింది.

* 10 మంది కంటే ఎక్కువగా హాజరయ్యే అన్ని కార్యక్రమాలపై పూర్తి నిషేధం విధించాలి.

* అలాంటి సమూహాలుగా ఏర్పడే అవకాశమున్న అన్ని కేంద్రాలు, వేదికలను మూసివేయాలి.

* ఉద్ధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఇండోర్‌ప్రదేశాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థనా మందిరాలను మూసివేయాలి

* జీనోమ్‌ సీక్వెన్స్‌ పరీక్షలను 5శాతానికి పెంచాలి. ఈ సమాచారాన్ని అన్ని జిల్లాలకు అందించాలి. తద్వారా కొత్త రకం వైరస్‌ల వ్యాప్తిని తగ్గించవచ్చు

* దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు వద్దని లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌ స్పష్టం చేసింది. ముఖ్యంగా పేదలు వినియోగించే రైలు, రోడ్డు మార్గాలపై ఆంక్షలు వద్దని పేర్కొంది. ఇదే సమయంలో బస్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

* రాష్ట్రాల మధ్య ప్రయాణం సాగించే వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టు ఉండాలని సిఫార్సు చేయడం లేదని టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. వీటి ద్వారా అనవసరంగా కొవిడ్‌ పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రయాణ సమయంలో వైరస్‌ సోకే ప్రమాదాన్ని ఇవి తగ్గించలేవని పేర్కొంది.

* ఇంటినుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరికి మాస్కు తప్పనిసరి చేయాలి

* వైరస్‌ ఉద్ధృతిపై నమ్మకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. తద్వారా అధికారులు నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని