Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్‌..!

దేశవ్యాప్తంగా ఏడాదిలో 35లక్షల మంది విద్యార్థులు 11వ తరగతిలోకి అడుగుపెట్టలేకపోయారని కేంద్ర విద్యాశాఖ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 31 May 2023 15:22 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాశాఖల బోర్డులు (Education Board) అనుసరిస్తున్న విధానాల్లో వ్యత్యాసాల వల్ల ఆయా బోర్డుల పరిధిలో పిల్లల ఉత్తీర్ణత శాతాల్లోనూ భారీ తేడాలు ఉంటున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రమాణాల పరంగా క్షేత్రస్థాయిలోనూ పరిస్థితులు కూడా ఒకేవిధంగా లేకపోవడం ఈ సవాళ్లలో భాగమని పేర్కొంది. ఇలా పలు కారణాల వల్ల కేవలం ఏడాదిలో దేశవ్యాప్తంగా 35లక్షల మంది 11వ తరగతిలోకి అడుగు పెట్టలేకపోయారని తెలిపింది. అందులో 27.5లక్షల మంది 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించకపోగా.. మరో 7.5లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని కేంద్ర విద్యాశాఖ (Education Ministry) జరిపిన తాజా అధ్యయనం పేర్కొంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యాశాఖకు సంబంధించి మూడు సెంట్రల్‌ బోర్డులు ఉన్నాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE), కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (CISCE), నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (NIOS)లు ఉన్నాయి. ఇవే కాకుండా అన్ని రాష్ట్రాల్లో వివిధ స్టేట్‌ బోర్డులు కలిపి మొత్తం 60 స్కూల్‌ బోర్డులు (School Board)ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాల్లో స్పష్టమైన తేడాలు కనిపించడంతో దేశవ్యాప్తంగా ఉన్న బోర్డుల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు ఉపక్రమించామని కేంద్ర పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలో ఉన్న 60 బోర్డులను ప్రమాణాలను విద్యాశాఖ పరిశీలించింది. అందులో ఉత్తర్‌ప్రదేశ్‌, సీబీఎస్‌ఈ, మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమబెంగాల్‌లోనే 50శాతం విద్యార్థులు నమోదై ఉన్నారు. మరో 50శాతం మంది విద్యార్థులు మిగతా 55బోర్డుల పరిధిలో ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. ఈ క్రమంలో పది, పన్నెండో తరగతి ఫలితాల్లో తేడాలు, అందుకుగల కారణాలను విశ్లేషించగా..

  • సీనియర్‌ సెకండరీ ఎగ్జామ్స్‌లో.. మేఘాలయాలో ఉత్తీర్ణత 57శాతంగా ఉండగా కేరళలో అత్యధికంగా 99.85శాతంగా ఉంది.
  • దేశవ్యాప్తంగా 35 లక్షల మంది విద్యార్థులు 11వ తరగతికి చేరలేకపోతున్నారు. ఇందులో 27.5లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతుండగా.. 7.5లక్షల మంది పరీక్షకు హాజరుకావడం లేదు.
  • దేశవ్యాప్తంగా డ్రాప్‌ఔట్‌ అవుతున్న వారిలో 85శాతం కేవలం 11 రాష్ట్రాల్లోనే ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనే విద్యార్థుల డ్రాప్‌ఔట్‌లు ఎక్కువగా ఉన్నాయి.
  • రాష్ట్రస్థాయి బోర్డుల్లో ఫెయిలయ్యే రేటు ఎక్కువగా ఉండటానికి అక్కడి స్కూళ్లలో సరిపడా ఉపాధ్యాయుల లేమి, శిక్షణ పొందిన వారు లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది.
  • వివిధ స్టేట్‌ బోర్డుల ఫలితాల్లో వ్యత్యాసాలను పరిశీలించేందుకుగాను ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, కర్ణాటక, కేరళ, మణిపుర్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 10, 12వ తరగతుల ఫలితాలనూ తాజా అధ్యయనం విశ్లేషించింది.
  • ఇలా వివిధ బోర్డులు అనుసరిస్తున్న భిన్న నమూనాలే విద్యార్థుల ప్రతిభలో వ్యత్యాసాలకు కారణంగా తాజా అధ్యయనం పేర్కొంది. అయితే, సెకండరీ, హైయ్యర్‌ సెకండరీ బోర్డులను కలిపి ఒకే బోర్డుగా మార్చడం విద్యార్థులకు దోహదపడుతాయని తెలిపింది. అంతేకాకుండా వివిధ బోర్డుల్లో సెలబస్‌ వేర్వేరుగా ఉండటం జాతీయ స్థాయి ఎంట్రెన్స్‌ టెస్టుల్లో విద్యార్థులకు ఆటంకంగా మారినట్లు గుర్తించింది.
  • సైన్స్‌ సెలబస్‌ను సెంట్రల్‌ బోర్డులో కలపడం వల్ల జేఈఈ, నీట్‌ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ప్రయోజకరంగా ఉంటుందని స్టేట్‌ బోర్డులకు తాజా అధ్యయనం సిఫార్సు చేసింది
  • పదవ తరగతి స్థాయిలో డ్రాప్‌ఔట్‌లను కట్టడి చేయడం ఈ ప్రామాణీకరణ ప్రయత్నానికి మరో కారణమని తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు