Rakesh Tikait: ‘ఆ కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వ శవపేటికకు ఆఖరి మేకు’

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అన్నదాతల ఐక్యతను చాటుతూ ఆయా సందర్భాల్లో మహాపంచాయత్‌లూ నిర్వహించారు. తాజాగా మరో మహాపంచాయత్‌ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. లఖింపుర్‌ ఖేరి పరిణామాల...

Published : 10 Nov 2021 01:36 IST

లఖ్‌నవూ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అన్నదాతల ఐక్యతను చాటుతూ ఆయా సందర్భాల్లో మహాపంచాయత్‌లూ నిర్వహించారు. తాజాగా మరో మహాపంచాయత్‌ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. లఖింపుర్‌ ఖేరి పరిణామాల నేపథ్యంలో అక్టోబరు 26నే లఖ్‌నవూలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తొలుత ప్రకటించినా.. పంట కోతలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్‌ 22కు వాయిదా వేశారు. మంగళవారం ఈ విషయమై భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. లఖ్‌నవూలో నిర్వహించనున్న ఈ కిసాన్ మహాపంచాయత్ చరిత్రాత్మకం కానుందన్నారు.

పుర్వాంచల్‌లోనూ ఉద్యమం ఉద్ధృతం..

సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం, మూడు సాగు చట్టాల శవపేటికకు ఆఖరి మేకుగా నిరూపితమవుతుందని టికాయిత్‌ పేర్కొన్నారు. ఇకముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని పుర్వాంచల్‌ ప్రాంతంలోనూ అన్నదాతల ఉద్యమం తీవ్రతరం కానున్నట్లు వెల్లడించారు. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘దేశ రైతులు మోదీని రైతు పక్షపాతిగా భావించడం లేదు. రైతులను మోదీ.. దేశం నుంచి వేరు చేసి చూస్తున్నట్లు భావిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్‌ 26 వరకు రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు ఆయన ఇదివరకే వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని