వేధింపులకు చట్టాలు ఆయుధాలు కాకూడదు

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి సహా మరో ఇద్దరికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు పొడిగించింది. బాంబే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని తెలిపింది......

Updated : 27 Nov 2020 14:07 IST

అర్ణబ్‌కు బెయిల్‌ పొడిగిస్తూ సుప్రీం కీలక వ్యాఖ్యలు

దిల్లీ: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి సహా మరో ఇద్దరికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు పొడిగించింది. బాంబే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిగే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టే చట్టాల పేరిట కొంతమందిని లక్ష్యంగా చేసుకొని వేధించడాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని గుర్తుచేసింది. జస్టిస్‌ డీ.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా గోస్వామికి బెయిల్‌ ఇవ్వడానికి గల కారణాలను ధర్మాసనం పేర్కొంది. చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు, హైకోర్టుతో పాటు కింది కోర్టులపై ఉందని వ్యాఖ్యానించింది. లక్షిత వేధింపులకు చట్టాలు ఆయుధాలు కాకుండా చూడాలని హితవు పలికింది. ప్రభుత్వాలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఎవరైనా ప్రాథమిక ఆధారాలు చూపితే కోర్టులు వాటిని తిరస్కరించలేవని తెలిపింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఒక్కరోజు హరించినా..అది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. బెయిల్‌ పిటిషన్లను విచారించే విషయంలో కోర్టు నిబంధనల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రాథమిక ఆధారాలను చూస్తే.. అర్ణబ్‌ గోస్వామిపై నమోదైన తాజా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు.. ఆత్మహత్యకు కారకుడిగా పేర్కొనడానికి కావాల్సిన కారణాలకు మధ్య సంబంధమే లేదని ధర్మాసనం తెలిపింది. 

నవంబరున 11న అర్ణబ్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2018లో ఆత్మహత్య చేసుకున్న అన్వయ్‌ నాయక్‌ అనే ఇంటీరియర్‌ డిజైనర్‌.. అర్ణబ్‌ తనకు బకాయిలు చెల్లించలేదంటూ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఆ కేసులో ముంబయి పోలీసులు అర్ణబ్‌ను నవంబరు 4న అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకొని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని