usa-china talks: బైడెన్‌- షీ జిన్‌ పింగ్‌ భేటీ..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ మధ్య తొలిసారి ముఖాముఖీ వర్చువల్‌ భేటీ మొదలైంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో

Updated : 16 Nov 2021 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ మధ్య తొలిసారి వర్చువల్‌ భేటీ మొదలైంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం లభిస్తోంది. వీరి మధ్య తైవాన్‌, వాణిజ్యం, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు బహిరంగ ఘర్షణలుగా మారకూడదని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

తొలి సమావేశం ఎలా మొదలైంది..

సమావేశం మొదట్లో ఇరు దేశాధినేతలు పరస్పరం అభివాదం చేసుకొన్నారు. ఈ సందర్భగా చైనా అధినేత షీజిన్‌ పింగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా పాత మిత్రుడు బైడెన్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఇరు దేశాల మధ్య సమాచార సంబంధాలు మరింత పెరగాలి. దీంతోపాటు సమస్యలపై సమష్టిగా పోరాడాలి. పర్యావరణ కాలుష్యం వంటి ప్రపంచ సమస్యలను ఎదుర్కోవడానికి ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు అవసరం. మనుషులు ఇప్పుడు గ్లోబల్‌ గ్రామాల్లో ఉంటున్నారు. అందుకే సమస్యలను ఎదుర్కోవడానికి పటిష్ఠమైన సంబంధాలు, సహకారం ఉండాలి. సానుకూల దిశలో అమెరికా-చైనా సంబంధాలను తీసుకెళ్లేందుకు నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అని పేర్కొన్నారు.

దీనికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పందిస్తూ ‘‘మేం మరీ ఫార్మల్‌ గా చర్చలు మొదలు పెడుతున్నాం ఏమో.. మనమిద్దరం పరస్పరం ఎప్పుడూ ఇంత ఫార్మల్‌గా లేం. మన మధ్య నిరంతరం మంచి సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. ఇరు  దేశాల మధ్య పోటీ బహిరంగ యుద్ధంగా మారకుండే చూసేందుకు విచక్షణతో పనిచేసే ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మీరు, నేను కొన్ని విషయాలు మాట్లాడుకొన్నాం. మన సంబంధాల విషయంలో కొన్ని దేశాల పాత్ర కూడా ఉంది. అందుకే అమెరికా మిత్రులు, భాగస్వాముల ప్రయోజనాలను కూడా చూస్తుంది’’ అని పేర్కొన్నారు. తైవాన్‌ విషయంలో అమెరికా-చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం చైనాకు ఏమాత్రం రుచించే అవకాశం లేదు.

చైనా- తైవాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్‌ ఉందని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు