Anand Mahindra: నాయకత్వం అంటే ఇదీ.. ప్రధాని మోదీపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

ప్రధాని మోదీ దీపావళి వేడుకలను సైనికులతో నిర్వహించుకున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ప్రధాని మోదీని ప్రశంసించారు.

Published : 26 Oct 2022 01:39 IST

దిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ సోమవారం కార్గిల్‌కు వెళ్లారు. జవాన్లతో ముచ్చటించారు. వారికి స్వయంగా మిఠాయిలు తినిపించిన ప్రధాని.. వారితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. జవాన్లతో వేడుకల్లో పాల్గొన్న మోదీ వీడియోను పంచుకుంటూ.. ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, పని ప్రాంతంలో విధులు నిర్వహించేవారితో ఇలా ఎవరితోనైనా వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటమే నాయకత్వం’ అని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు. కాగా ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే దీన్ని 1.3మిలియన్ల మంది వీక్షించారు.

దీపావళి వేడుకలను సైనికులతో నిర్వహించుకునేందుకు సోమవారం కార్గిల్‌ వెళ్లిన మోదీ వారితో కలిసి సరదాగా గడిపారు. సైనికులే తన కుటుంబమని, అందుకే పండగకు ఇక్కడకు వచ్చానన్నారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న సైనికులతో ఉండటం కంటే గొప్ప దీపావళి వేడుక తనకు మరేదీ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన జవాన్లు కొందరు గీతాలు ఆలపిస్తుండగా.. ప్రధాని వారికి మిఠాయిలు తినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. కాగా ఇదే వీడియోను ఆనంద్‌ మహీంద్రా తాజాగా పోస్టు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని