హఫీజ్‌ సయీద్‌ కుమారుడిపై కేంద్రం కీలక నిర్ణయం

ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్‌ హషీజ్‌ సయీద్‌ కుమారుడు తల్హా సయీద్‌ను పేరును మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ భారత ప్రభుత్వం

Published : 10 Apr 2022 01:31 IST

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన హోంశాఖ

దిల్లీ: ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్‌ హషీజ్‌ సయీద్‌ కుమారుడు తల్హా సయీద్‌ను పేరును మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘‘తల్హా సయీద్‌ ఉగ్ర కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడని మేం విశ్వసిస్తున్నాం. అందుకే, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, 1967 కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నాం’’ అని కేంద్ర హోం శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్హా 32వ వ్యక్తి. ఇదే జాబితాలో హఫీజ్‌ సయీద్‌ పేరు కూడా ఉంది.

46ఏళ్ల తల్హా సయీద్‌ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. తండ్రి స్థాపించిన లష్కరే తోయిబా ముఠాలో సీనియన్‌ నాయకుడైన తల్హా.. ఈ సంస్థ క్లెరిక్‌ విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌, అఫ్గానిస్థాన్‌లో లష్కరే తోయిబా నియామకాలు, నిధుల సేకరణ, దాడులకు కుట్ర రచించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న రెండు కేసుల్లో హఫీజ్‌ సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే తల్హాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ భారత్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

2008లో ముంబయిలో చోటుచేసుకున్న వరుస పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్‌కు పాక్‌ కోర్టు నిన్న రెండు కేసుల్లో 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నట్లు పాక్‌ చెబుతోంది. కానీ అతడు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విషయం చిమ్మే ప్రసంగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు ఆరోపిస్తున్నాయి. ఎన్నో ఉగ్రదాడులకు కీలక సూత్రధారి అయిన హఫీజ్‌ పేరు అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉంది. అతడిపై అమెరికా కోటి డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని