Mann Ki Baat: భారత ఉత్పత్తులు విశ్వవ్యాప్తం.. ఏడాదిలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు!

స్వదేశీ ఉత్పత్తులను ఎగుమతిని గణనీయంగా పెంచుకుంటోన్న భారత్‌.. వాటి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకుంటోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Updated : 27 Mar 2022 15:41 IST

మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటన

దిల్లీ: స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతిని గణనీయంగా పెంచుకుంటున్న భారత్‌.. వాటి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకుంటోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో భారత్‌ నిర్దేశించుకున్న రూ.30 లక్షల కోట్ల (400 బిలియన్‌ డాలర్లు) విలువైన ఎగుమతుల మైలురాయిని చేరుకుందన్నారు. ఇది కేవలం ఆర్థికవ్యవస్థకు చెందిన విషయం మాదిరిగానే కనిపించినప్పటికీ.. భారత శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా మన దేశ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని దీని అర్థమని ప్రధాని మోదీ వివరించారు. ఈ మేరకు ప్రతినెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

ఈ-మార్కెట్‌ ప్లేస్‌ పేరుతో ప్రభుత్వం వివిధ రకాల ఉత్పత్తుల సేకరణలో చిన్న పారిశ్రామికవేత్తలు కీలకంగా మారారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘గతంలో కేవలం పేరున్న వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులు అమ్మేవారు. కానీ, ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ-మార్కెట్‌ప్లేస్‌ (eMarketplace) పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో ఈ విధానం పూర్తిగా మారిపోయింది. ఏడాది కాలంలోనే వీరి నుంచి రూ.లక్షకోట్ల ఉత్పత్తును ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదే నూతన భారత్‌ స్ఫూర్తి’ అంటూ ప్రధాని మోదీ వివరించారు.

ఇక భారతీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. అందుకు దేశంలోని రైతులు, చేతివృత్తులు, చేనేత కార్మికులు, ఇంజినీర్లతోపాటు ఎంఎస్‌ఎమ్‌ఈ రంగంలోని చిన్న పారిశ్రామికవేత్తలే కీలకమన్నారు. వారి కృషి వల్లే రూ.30లక్షల కోట్ల (400 బిలియన్‌ డాలర్లు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యాన్ని భారత్‌ సాధించిందన్నారు. ఇలా భారత ప్రజల శక్తి, సామర్థ్యాలు విశ్వవ్యాప్తం కావడం తనకెంతో గర్వంగా ఉందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి ఒక్క భారతీయుడు స్థానిక గళం (లోకల్‌ ఉత్పత్తులకు ప్రాధాన్యం) విప్పితే.. ఇదే లోకల్‌, గ్లోబల్‌గా మారడానికి ఎంతో సమయం పట్టదన్నారు. తద్వారా భారత ఉత్పత్తుల విలువను మరింత ఇనుమడింపజేయవచ్చని ప్రధాని మోదీ సూచించారు.

ఇదిలా ఉంటే, 2018-19 సంవత్సరానికి గాను దేశీయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 330 బిలియన్‌ డాలర్లతో రికార్డు సాధించింది. తాజాగా దీనిని అధిగమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 400 బిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారత ఉత్పత్తులు ఈ స్థాయిలో ఎగుమతి కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని