‘ఆయన్ను కలిశాక.. సుదామను కలవడానికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుగా ఉంది’

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 106ఏళ్ల వయసున్న భాజపా కార్యకర్త భులాయ్‌ భాయ్‌ను దిల్లీలోని ఉత్తర్‌ప్రదేశ్‌ భవన్‌లో గురువారం కలిశారు. జన్‌సంఘ్‌.. భారతీయ జనతా పార్టీగా అవతరించిన సమయంలో............

Published : 14 Oct 2021 22:57 IST

రాజ్‌నాథ్‌ వచ్చి తనను కలవడంపై 106ఏళ్ల వృద్ధుడి హర్షం

దిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 106ఏళ్ల వయసున్న భాజపా కార్యకర్త భులాయ్‌ భాయ్‌ను దిల్లీలోని ఉత్తర్‌ప్రదేశ్‌ భవన్‌లో గురువారం కలిశారు. జన్‌సంఘ్‌.. భారతీయ జనతా పార్టీగా అవతరించిన సమయంలో భులాయ్‌ భాయ్‌ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన్ను కలిసిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో భులాయ్‌ భాయ్‌ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశాక నేనింకా యువకుడిలా మారిపోయినట్లు అనిపిస్తోంది. సుదామను కలవడానికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉంది. నేను ఆయన ప్రేమ, ఆశీర్వాదాలను అందుకున్నాను. మేమిద్దరం గత రోజులను గుర్తు చేసుకున్నాం. ఆయన్ను మా ఇంటికి ఆహ్వానించాను’’ అని భులాయి భాయ్ పేర్కొన్నారు. మరోవైపు భులాయ్‌ భాయ్‌తో జరిగిన సమావేశాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా వివరించారు. ‘‘నేను భులాయ్ భాయ్‌ని కలవడానికి వచ్చాను. దేశంలో జన్‌సంఘ్ ఉన్న సమయంలో ఆయనే భాజపా కార్యకర్తలందరి కంటే పెద్దవాడు. 1977లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు’’ అని ఆయన తెలిపారు.

70ఏళ్ల క్రితం దసరా రోజునే భులాయ్‌ భాయ్‌ జన్‌సంఘ్‌లో చేరారు. సరిగ్గా అదేరోజున అనుకోకుండా రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. అప్పటి భాజపా కార్యకర్తలు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్‌ ముఖర్జీతో కలిసి ఆయన పనిచేశారు. జన్‌సంఘ్‌ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దేశంలో కరోనా వ్యాప్తి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని